జనగామ, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రాజకీయాలకతీతంగా అందరం కలిసి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తాను ఎంత తగ్గేందుకైనా..ఎక్కడికి వచ్చేందుకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చైర్పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన జరిగిన జనగామ మున్సిపల్ తొలి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు చేద్దామని..ఆ తర్వాత సభ్యులంతా తమతమ వార్డుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
ఎలాంటి బేషజాలకు పోకుండా జనగామకు నిధులు రాబట్టే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలను కలిసి వారి సహకారం కోరేందుకు ముందుంటానని అన్నారు. అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి, నిత్యం అందుబాటులో ఉంటూ పట్టణాన్ని ప్రగతి పథంలో నిలుపుదామన్నారు. తాను వస్తే పని జరుగుతుందని మీరంతా భావిస్తే, పార్టీలను పక్కనబెట్టి జనగామ ప్రజల కోసం తాను ఎంత దూరమైనా.., ఎవరి వద్దకైనా వచ్చి నిధులు కోరుతానని ఎమ్మెల్యే పల్లా అన్నారు. రానున్న మూడేళ్ల కాలం మీతోపాటు కలిసి పనిచేస్తా.. కలిసి నడుస్తా.. అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు.
కౌన్సిల్‌కు ఎన్నికైన 30 మంది సభ్యులను పేరుపేరునా అభినందించిన పల్లా వారికి శుభాకాంక్షలు తెలిపి ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని, వార్డుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అంతకు ముందు చైర్‌పర్సన్‌గా ఎన్నికైన బాలమణి కార్యాలయంలోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు., చైర్‌పర్సన్‌తోపాటు బీఆర్ఎస్ వైస్ చైర్మన్ భాషా పర్వతాలును ఎమ్మెల్యే పల్లా సన్మానించారు.
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్కు మద్దతుగా చేయి ఎత్తిన స్వతంత్ర కౌన్సిలర్ సందుపట్ల మంజులపై తాను అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన స్వతంత్ర కౌన్సిలర్ మారబోయిన పాండు బహిరంగంగా క్షమాపణ కోరారు. కొడుకు లాంటి తాను తెలియక చేసిన తప్పిదానికి నిండు మనసుతో మన్నించాలని ఆయన కౌన్సిల్ తొలి సమావేశంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.