హనుమకొండ, ఫిబ్రవరి 27 : ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిందని, బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో ఆర్టీసీ, రెవెన్యూ శాఖ అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదిత స్థలం, నిర్వహణ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన వంద ఎలక్ట్రిక్ బస్సులు గ్రేటర్ వరంగల్ పరిధిలో నడుస్తాయన్నారు. మడికొండలో ప్రతిపాదిత ఐదెకరాల స్థలాన్ని ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా హనుమకొండ చౌరస్తా బస్ బే అభివృద్ధిపై ఆర్టీసీ, కుడా అధికారులతో చర్చించారు. కాజీపేటలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, మధు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్మ్రేశ్, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.