కరీమాబాద్, జనవరి 6 : రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలే పాతరేస్తారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం ఖిలా వరంగల్ పెట్రోల్‌బంకు జం క్షన్ వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఎన్నికలప్పుడు ఎకరానికి రూ.15వేలు ఇస్తానని చెప్పి ఇప్పుడు 12వేలకు కుదించి రైతుల పొట్టకొడుతున్నదని మండిపడ్డారు.
ఇప్పటికే ఏడాది కాలంగా రైతుబంధు రాలేదని గ్రామాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూటకో మాట మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసం చేస్తుందన్నారు. రైతుబంధు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నదన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబంధు’గా నిలిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి రైతు రాబందుగా మారారని ఎద్దేవా చేశారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేస్తున్నారన్నారు. తులం బంగారం.. పింఛన్లు, మహిళలకు 2500 రూపాయలపై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇక జిల్లా మంత్రి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ఆధ్వర్యంలో పోరాటం తప్పదన్నారు. రైతులు, ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉన్నదని ప్రజల పక్షాన ప్రజల సహకారంతో ప్రభుత్వాని నిలదీస్తామని నరేందర్ చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్పొరేటర్లు మరుపల్ల రవి, ది డ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌బాబు పాల్గొన్నారు.