వరంగల్, సెప్టెంబర్ 18 : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బల్దియా అధికారులు విఫలం అవుతున్నారని, మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనుల్లో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. బుధవారం కార్పొరేషన్ ఎదుట సమస్యలను పరిష్కరించాలని 40 డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మరుపల్ల రవి, నాయకులు ప్రజా నిరసన దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ సమస్యలను పరిష్కరించే వరకు మరుపల్ల రవికి వెన్నంటి ఉంటామన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మాట్లాడుతూ.. సమస్యలను పట్టించుకోకుండా మేయర్, అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కార్పొరేటర్ రవి మాట్లాడుతూ.. డివిజన్ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు మేయర్, కమిషనర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా డివిజన్ సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
కాగా, కార్పొరేటర్ రవి చేపట్టిన ప్రజా నిరసన దీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఎడ్ల అశోక్‌రెడ్డి, పుల్లారావు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్పొరేటర్లు ఆవాల రాధికారెడ్డి, దిడ్డి కుమారస్వామి, గుగులోత్ దివ్యారాణి, సీపీఎం నాయకులు సింగారపు బాబు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఆకుతోట రాజు, పూదరి విజయ్, వనం కుమార్, మరుపల్ల గౌతమ్, కుండె రాజు, బొల్లం యాకయ్య, మిర్యాల కుమారస్వామి, రాజేశ్వర్, రాజన్‌బాబు, శరబంధం, పసుపూరి రమేశ్, మేకల రవి, మంద నవీన్ పాల్గొన్నారు.