నర్సంపేట, జూన్ 24 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ సర్కార్ రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. మంగళవారం పెద్ది మాట్లాడుతూ విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా, వడ్ల బోనస్‌ను ప్రభుత్వం ఎగవేసిందన్నారు. 19 నెలలుగా అన్నదాతను అరిగోస పెడుతున్న ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రూ. 12 వేలకు పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. రైతుకు ఏం లాభం చేశారని విజయోత్సవ సంబురాలు చేస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. రెండు సీజన్ల భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు ఇవ్వనందుకా? రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వకుండా మోసం చేసినందుకా? అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చారాణ చేసి బారాణ మందిని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.
అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్న వడ్లకే పరిమితమయ్యారని, పంట బీమా పేరిట రైతును ఉసురుమనిపించారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. జనుము, జీలుగ విత్తనాల ధరలు పెంచి రైతులను ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అటకెక్కించారని, పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతులు కాంగ్రెస్ పాలనలో పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నారన్నారు. బీఆర్ఎస్ది సంక్షేమ ప్రభుత్వమైతే కాంగ్రెస్‌ది రైతు సంక్షోభ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని పెద్ది డిమాండ్ చేశారు.