దేవరుప్పుల, మార్చి 25 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మంజూరైన పలు పనులను కొనసాగించాలని, దేవాదుల నీటిని విడుదల చేసి జనగామ జిల్లా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈమేరకు మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో వారి ఛాంబర్లలో కలిశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో రూ.500 కోట్ల పనులు మంజూరు చేశానని కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. నిలిచిన పనులను కొనసాగించాలని, వాటిని నిధులు విడుదల చేసేలా చూడాలని భట్టిని కోరారు. జనగామ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల అవుతాయని ఆశతో రైతులు యాసంగి నాట్లు పెట్టి భంగపడ్డారని మంత్రి ఉత్తమ్‌కు వివరించారు. రిజర్వాయర్లు నింపకపోవడంతో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో వరి ఎక్కువగా ఎండిపోతున్నదని ఇప్పటికైనా దేవన్నపేట పంపులు ఆన్ చేస్తే రైతులకు కొంతైనా మేలు జరుగుతుందని అక్కడే ఉన్న సంబంధిత సాగునీటి అధికారులకు వివరించారు.