Kalyani Priyadarshan | క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక ఎంతో ఆత్మీయంగా సాగింది. పెళ్లి అనంతరం విజయ్–రష్మిక తమ వివాహ వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో “విరోష్” జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.
ఇదిలా ఉండగా, రష్మికకు స్నేహితురాలైన కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజయ్–రష్మికల పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. అత్యంత దయగల అమ్మాయి తన ప్రాణ స్నేహితుడిని వివాహం చేసుకోవడం నేను చూశాను. ఆమె అతడి వైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనందభాష్పాలు వారి ప్రేమకు గుర్తులుగా మారాయి అంటూ పేర్కొన్నారు. అలాగే, ఆమె ప్రతి అడుగు ఎన్నో భావోద్వేగ క్షణాలను మోసుకువస్తున్నట్టుగా అనిపించింది. వారి మౌనమే ప్రతిదానికి సమాధానంగా నిలిచింది. స్నేహంగా మొదలై ప్రేమగా మారిన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వీరికి ఇది మరో అందమైన ప్రారంభం అని కళ్యాణి తన పోస్ట్‌లో తెలిపారు.
కళ్యాణి ప్రియదర్శన్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఆమె పోస్ట్‌ని షేర్ చేస్తూ, నూతన దంపతులకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు భార్య భర్తలుగా మారారు. స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవ్వడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.టాలీవుడ్లో ఈ పెళ్లి వేడుక హాట్ టాపిక్‌గా మారగా, సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకి ఆశీస్సులు అందిస్తున్నారు.