కురవి, నవంబర్ 17 : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్‌కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జూబ్లీహిల్స్ గెలుపు కోసం రూ. 300 కోట్లు ఖర్చుచేసి మంత్రులు, ఎమ్మెల్యేలను రం గంలోకి దించారన్నారు. రాష్ట్రంలో వరదలతో రైతులతో పాటు అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయినా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ క్షణంలోనైనా తన పదవికి ఎసరొస్తుందని, అందుకే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి గెలుపొందారని పేర్కొన్నారు.
పది మంది ఎమ్మెల్యేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఉప ఎన్నికలు వస్తే అందు లో ఎంత మందికి మంత్రి పదవి ఇస్తారో చూడాలని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ సర్కారు ఏ వర్గానికి న్యాయం చేయలేకపోయిందన్నారు. కేసీఆర్ బిడ్డగా, ఉద్యమంలో పాల్గొన్న మహిళా నాయకురాలిగా కవితపై గౌరవం ఉందని, కానీ పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కావాలనే ఆమెతో నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను విమర్శించే నైతిక హకు కవితకు లేదని అన్నారు. ఆమె తెలంగాణ ఉద్యమానికి ముందు, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్, ఈ-కార్ రేసింగ్ ఘటనలను నేటి వరకు ప్రభుత్వం తేల్చలేదని, ఈడీ, సీబీఐ, ఏసీబీ పేర్లు తీసుకొస్తూ కేటీఆర్‌ను బద్నాం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. అబద్ధాలు ఎన్నిరోజులు నిలువవని గుర్తుచేశారు. డోర్నకల్ నియోజకవర్గంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుధ్యం లోపించిందని, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నా యకులు ఐలి నరహరి గౌడ్, బాదె నాగయ్య, గుగులో త్ నెహ్రూ, బోడ శ్రీను, కిషోర్ వర్మ, కిన్నెర మల్లయ్య, కళ్లెపు శ్రీను, వినోద్, గుండెబోయిన సూరయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్తీక మాస చివరి సోమ వారం కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని సత్యవతిరాథోడ్ కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.