తొర్రూరు, ఏప్రిల్ 25 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని గుర్తించి సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాలుగున్నర నెలలు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు డివిజన్ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ రైతులను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఆ తేదీ నాటికి రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే రాజీనామా చేస్తావా.. అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. తాను ప్రకటించినట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు తన రాజీనామా లేఖతో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తున్నానని, నువ్వు హామీలను అమలు చేస్తానని నమ్మకం ఉంటే నీ రాజీనామా లేఖను తీసుకొని రావాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తే ఐదేళ్ల పాటు తనకు ఎమ్మెల్యే పదవి లేకున్నా పర్వాలేదని, తెలంగాణ ప్రజల కళ్లల్లో ఆనందం చూసేందుకు పదవీ త్యాగానికి సిద్ధమన్నారు. దేవుళ్లపై ఒట్లు పెట్టడం కాదు.. ధైర్యం ఉంటే అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రా అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నందుకు, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావును ఓడించినందుకు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి సుధీర్‌కుమార్‌కు భారీ మెజార్టీ అందించేందుకు పాలకుర్తి ప్రజలు ఎదురు చూ స్తున్నారని తెలిపారు.
కాగా, సభకు వేలాది మంది తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. సమావేశంలో తొర్రూరు జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు డాక్టర్సోమేశ్వర్రా వు, కిశోర్‌రెడ్డి, సీతారాములు, అంజ య్య, గాంధీనాయక్, సుధీర్‌రెడ్డి, ఐలయ్య, రామచంద్రయ్యశర్మ, జ్యో తి ్మయి సుధీర్, అనిమిరెడ్డి, రంగు కుమార్, సత్తెమ్మ, సుందర్‌రాంరెడ్డి, బస్వ మల్లేశం, నవీన్, శ్రీనివాస్, నా గిరెడ్డి, రాంబాబు, యాకాంతం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తనను గెలిపించాలి. వరంగల్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా. రుణమాఫీ అశతో కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన రైతులు ఇప్పుడు నష్టపోయామని బాధపడుతున్నారు. ఒకవైపు పంటలు పండక మరోవైపు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు కేసీఆర్‌కు వైపు చూస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల ద్వారా లబ్ధి పొందితే కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. లేదంటే రేవంత్‌రెడ్డి మోసాన్ని గుర్తించి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ మోసపోయి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆరు గ్యారెంటీలకు పంగనామం పెడుతుందని, అదే బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయిస్తామని తెలిపారు. ఎక్కడైనా రూ.2500 మద్దతు ధరకు క్వింటాలు వడ్లు కొన్నా రా., ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇచ్చారా.., రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సా యం వేశారా.., పింఛన్లు నెలకు రూ.4వేలు వచ్చాయా అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇవి పొందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. తీసుకోలేదంటే బీఆర్ఎస్కు ఓటే వేయండి అని పిలుపునిచ్చారు.
నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ఓటుకు నోటుతో.., నేడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాడుకుంటూ ఓటుకు ఒట్టుతో రేవంత్‌రెడ్డి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. పోరాటాల ఖిల్లా వరంగల్ గడ్డ అని, ప్రజలు మరోసారి రేవంత్‌రెడ్డి మాటల తో మోసపోయేందుకు సిద్ధంగా లేరని, ఓటు అనే గడ్డపారతో కాంగ్రెస్‌ను పెకిలిస్తారని హెచ్చరించారు. మాదిగలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయని, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయన్నారు. మాదిగలకు రెండు, మాలలకు ఒకటి టికెట్ బీఆర్ఎస్ ఇచ్చిందని గుర్తు చేశారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచడంతోపాటు పాలు, పెరుగు, నిత్యావసర వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చి అదానీ, అంబాలనీలకు దోచి పెడుతూ పేద ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు.
ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా రూ.15వేలు భృతిని ప్రభుత్వం ఇచ్చేలా వారి పక్షాన పోరాడుతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు గడుస్తున్నా, మహాలక్ష్మీ పథకం అమలు చేయకుండా, పింఛన్ల మొత్తాన్ని పెంచకుండా, మహిళలకు రూ.10వేల వరకు, వృద్ధులు, వితంతువులు, పింఛన్‌దారులకు రూ.10వేల వరకు బకాయి పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలన్నారు. కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశారని పట్టపగలు కేసీఆర్‌ను మోసం చేసి పార్టీకి ద్రోహం చేశారని, కడియం లాంటి వాళ్లు జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ముఠా రాజకీయాలు, తిట్లు, ఓట్లు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని, తాగునీరు రాక, సాగు నీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ అహంకారాన్ని దించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచి తిరిగి ఓట్లు అడిగేందుకు ప్రజల మధ్యకు వస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో బస్సు మినహా అంతా తుస్సే అని ఎద్దేవా చేశారు. పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెచ్చి ట్యాపింగ్ లాంటి కేసుల్లో ఇరికించాలని ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారని, ఎవరికీ భయపడేది లేదని ప్రకటించారు.
మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తారా.. అన్న సందేహం ప్రజల్లోకి వచ్చేసిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారనే నివేదికలు రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని హామీల అమలుకు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని అన్నారు. ప్రజలు మోసపోతారు అని రేవంత్‌రెడ్డి బహిరంగంగా ఒక చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ప్రజలు ప్రతిసారి అలా మోసపోరు.. రేవంత్‌రెడ్డి అది గుర్తు పెట్టుకోండి.
కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అబ్యర్ధి మారెపల్లి సుధీర్‌కుమార్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు మెట్టు శ్రీనివాస్‌తోపాటు రాష్ట్ర, జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.