గట్టుప్పల్, మార్చి 04 : ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గట్టుప్పల్ మండల కేంద్రం ఏర్పాటై మూడు సంవత్సరాలు కావొస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజా అవసరాల కోసం అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా మండలంలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్ లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ ఆ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న హాస్పిటల్ భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.