దేవరుప్పుల, అక్టోబర్ 19: కాంగ్రెస్ గెలిస్తే ‘రైతుబంధు’కు రాంరాం చెబుతారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న మాటలు నేడు అక్షర సత్యమమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వానకాలం సీజన్లో రైతుబంధుకు ప్రభుత్వం ఎగనామం పెట్టడమంటే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకాని హామీలిచ్చి ప్రజలతో ఓట్లేయించుకున్న రేవంత్రెడ్డి హామీలను అటకెక్కించడంతో నేడు ప్రజలకు ఆయన మాటల్లోని పరమార్థం బోధపడిందన్నారు.
ప్రభుత్వానికి అప్పు పుట్టకపోవడంతోనే రైతులకు రుణమాఫీ, రైతుబంధు సాయం వేయలేకపోతున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని దయాకర్రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలును వాయిదా వేసినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం బయటపడిందన్నారు. రైతుభరోసా అందక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎర్రబెల్లి తెలిపారు. సబ్ కమిటీ, గైడ్లైన్స్ పేర కాలయాపన చేసి రైతుబంధు ఎగ్గొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కారుకు రైతులు గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు పెట్టబడి సాయం అందక, విత్తనాలు, ఎరువులు లభించక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ముష్టి ఇస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే రూ.15వేలు అందిస్తామన్న సిపాయి నేడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని ఎర్రబెల్లి ప్రశ్నించారు. రైతులతో చెలగాటమాడితే ప్రభుత్వం మాడిమసికాక తప్పదని హెచ్చరించారు. రైతులకు రైతుబంధు ఎగ్గొట్టి, కొందరికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేశామంటూ సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసారి రైతుబంధు వేయకపోతే ప్రజాప్రతినిధులను ఘెరావ్ చేస్తామని అన్నారు. ప్రజాసమస్యలపై అడుగుగడుగునా నిలదీస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని ఎర్రబెల్లి అన్నారు.