దేవరుప్పుల, మే 12: పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్ గెలుపు ఖాయమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పులలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానానికి పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు మెజార్టీ ఓట్లు వస్తాయన్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అందించిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలేనన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వాటిని నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ హామీలు మోసపూరితమని గ్రహించిన ప్రజలు ఉద్యమ నేత కేసీఆర్‌ను ఆదరిస్తున్నారని, కారు గుర్తుకు ఓటేస్తామని బాహాటంగా చెబుతున్నారని ఎర్రబెల్లి వివరించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్లో పదవులు అనుభవించి కేసీఆర్‌ను మోసం చేసిన వారని, వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.