వర్ధన్నపేట, అక్టోబర్ 9 : ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంగం మందికి కూడా చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. వానకాలం పూర్తవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా విడుదల చేయలేదని మండిపడ్డారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని రామోజీకుమ్మరిగూడెం గ్రామానికి చెందిన భూక్యా బీల్యా (55) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని ఎర్రబెల్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రైతు భరోసా లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాకముందు ఇదే పద్ధతిలో అప్పులు చేసి ఆర్థికంగా చిక్కిపోయారన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభు త్వం రైతులకు సకాలంలో రైతుబంధు అందించడంతో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని తెలిపారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ సమైక్య రాష్ట్రంలోని కష్టా లే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. రైతు లు ఏ మాత్రం అధైర్య పడొద్దని, బీఆర్ఎస్, కేసీఆర్ అండగా ఉంటారని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, నాయకులు గుజ్జ సంపత్‌రెడ్డి, తూళ్ల కుమారస్వామి, వేణుగోపాల్‌రావు తదితరులున్నారు.