పాలకుర్తి, ఫిబ్రవరి 23: మూడు రోజుల్లో గోదావరి జలాలు విడుదల చేసి పంటలకు నీరందించాలని లేకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, ఆ పార్టీ వచ్చి కరువును తెచ్చిందని మండిపడ్డారు. ఆదివారం పాలకుర్తి మండలం శాతాపురంలో దేవాదుల-4ఎల్ కాల్వ ద్వారా గోదావరి జలాలు రావడం లేవని రైతులు ఎర్రబెల్లి దృష్టికి తీసుకురాగా పరిశీలించారు. అనంతరం దేవాదుల ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి మూడు రోజుల్లో నీళ్లు వదలాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో చెరువులు మత్తళ్లు దూకాయని గుర్తుచేశారు. ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపడంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వెయ్యి ఎకరాల్లో వరి ఎండుతున్నదన్నారు. గతంలో రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు చూశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుకు రాంరాం చెప్పారని యూరియా కొరత ఏర్పడిందన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచుతుందన్నారు. త్వరలోనే ప్రజలు రైతులు కాంగ్రెస్ను ఉరికించి కొడతారని హెచ్చరించారు. ప్రస్తుత పాలకుల అసమర్థ విధానాలతో పాటు ముందుచూపు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు వరి వేయవద్దు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటడడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. అనంతరం వావిలాలలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలె సుందర్, మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, గంట పద్మ భాస్కర్, బీరెల్లి రవివర్మ, ఏలూరు కృష్ణమూర్తి, బానోత్ మహేందర్, వెంకట్, నల్లపు అశోక్, కోల రాజు ఉన్నారు.