ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పన్ను వసూళ్ల వేటను ముమ్మరం చేయాలని భావిస్తున్నది. దాదాపు 11 లక్షల మంది ప్రాపర్టీల లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధమవుతున్నది. సోమవారం ఆస్తిపన్ను వసూళ్లు, ఓటీఎస్ పథకంపై కమిషనర్ కర్ణన్ లక్ష్యాలను వివరించారు. అయితే అధికారులు విడుదల చేసిన నివేదికలో అకౌంట్స్ విభాగం పనితీరును ప్రశ్నిస్తున్నది.
ఒకవైపు ఆస్తిపన్ను రూపంలో రూ. 2,186 కోట్లు, ఓటీఎస్ రూపంలో రూ.322 కోట్ల మేర ఆదాయాన్ని ఆశించామని చెబుతున్న అధికారులు..మరోవైపు ఈ నెలాఖరులోగా బకాయిదారుల నుంచి వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా, నివేదికలోని కూడికలు, తీసివేతల్లో వందల కోట్ల తేడాలు కనిపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
-సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): బల్దియా నివేదిక ప్రకారం.. మొత్తం ఆస్తి పన్ను డిమాండ్ రూ. 5,230 కోట్లుగా ఉంది. ఇందులో పాత బకాయిలపై వడ్డీ మాఫీ (90 శాతం) కింద రూ. 2,495 కోట్లు మినహాయిస్తామని పేరొన్నారు. నిబంధనల ప్రకారం అసలు డిమాండ్ నుంచి వడ్డీ రాయితీని తీసివేస్తే నెట్ డిమాండ్ రూ. 2,735 కోట్లు కావాలి. కానీ నివేదికలో నెట్ డిమాండ్‌ను రూ. 2,985 కోట్లుగా చూపించారు. అంటే కేవలం ఒకే ఒక లెకలో ఏకంగా రూ. 250 కోట్ల వ్యత్యాసం కనిపిస్తున్నది. ఇంతటి భారీ వ్యత్యాసంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టమవుతుండడం గమనార్హం.
పాత బకాయిదారులను ప్రోత్సహించేందుకు 90 శాతం వడ్డీ మాఫీ ఇస్తున్నా.. యజమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జీహెచ్ఎంసీ 11.45 లక్షల అసెస్మెంట్లు ఉండగా, ఇప్పటివరకు పన్ను కట్టిన వారు 6.31 లక్షల మంది మాత్రమే. ఇంకా 5.13 లక్షల మంది పన్ను కట్టాల్సి ఉంది. అయితే ఈ నెల 15 నాటికి ఓటీఎస్ కింద పన్ను కట్టిన వారు కేవలం 1.11 లక్షల మంది మాత్రమే ఉండటం గమనార్హం. దీని ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ. 140 కోట్లు మాత్రమే. వేల కోట్ల బకాయిలు ఉండగా, కేవలం రూ. 140 కోట్లు రావడం పథకం వైఫల్యానికి అద్దంపడుతున్నది.
నగరంలో 5.13 లక్షల మంది మొండి బకాయిదారులు ఉంటే, గత 15 రోజుల్లో కేవలం 1,64,807 మందికి మాత్రమే డిమాండ్ నోటీసులు జారీ చేశారు. మిగిలిన సుమారు 3.5 లక్షల మందికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదనే దానిపై స్పష్టత లేదు. ఇక జోన్ల వారీగా చూస్తే ఖైరతాబాద్ జోన్ రూ. 366.74 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, చార్మినార్ జోన్ కేవలం రూ. 58.3 కోట్లతో అట్టడుగున నిలిచింది. పాతబస్తీ ప్రాంతాల్లో వసూళ్లు మందగించడంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సరిల్ స్థాయిలో వారంట్ ఆఫీసర్లను నియమించినట్లు నివేదికలో పేరొన్నారు. డిస్ట్రెస్ వారంట్లు జారీ చేసిన తర్వాత ఆస్తుల సీజింగ్ ప్రక్రియ చేపడతామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ బకాయిలు ఉన్న టాప్ డిఫాల్టర్ల జాబితాను సిద్ధం చేసి, చివరి విడతగా బల్ ఎస్ఎంఎస్లు పంపిస్తుండడం విశేషం. కాగా, లెకల్లో పొరపాట్లు సరిదిద్దుకోకుండా, క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించకుండా కేవలం జప్తు చేస్తామంటూ భయపెట్టడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమేనాన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.