హనుమకొండ ప్రతినిధి/హైదరాబాద్, జూలై 26 (నమస్తేతెలంగాణ): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం ఏడు గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. ఉదయం 8గంటల నుంచి సుమారు గంట పాటు ఎనిమిది సార్లు సీపీఆర్ చేశామని, ప్రత్యేక పరిస్థితులను అంచనా వేసి తొమ్మిదోసారి ధైర్యం చేసి మళ్లీ సీపీఆర్ చేయడంతో గుండె లయ అందుకున్నదని.. నిజంగా ఇది మెడికల్ మిరాకిల్ అని డాక్టర్ మమతారెడ్డి తెలిపారు. అయితే, గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే మార్గంలో రక్తం గడ్డ కట్టిందని, అందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చామని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించామని ఆమె చెప్పారు.
హుటాహుటిన హనుమకొండకు కేటీఆర్, హరీశ్‌రావు
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు వచ్చిందని తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే పార్టీ అధినేత కేసీఆర్‌కు సమాచారం అందించి, హుటాహుటిన హనుమకొండకు బయల్దేరి వెళ్లారు. స్థానిక నాయకులతో మాట్లాడి పెద్ది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి రోహిణి హాస్పిటల్‌కు చేరుకొని పెద్ది భార్య స్వప్నను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని భరోసానిచ్చారు. హాస్పిటల్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డితో ఎప్పటికప్పుడు వాకబు చేశారు. ఆ వెంటనే దవాఖాన యాజమాన్యంతో మాట్లాడి వైద్య బృందాలను సిద్ధం చేయించారు. మొదట ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలని భావించారు. అయితే మరింత సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించేందుకు రాష్ట్ర డీజీపీ, పోలీసు కమిషనర్లు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో మాట్లాడి గ్రీన్‌చానల్ ఏర్పాటు చేయించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో అంబులెన్స్‌కు పోలీస్ పైలట్ వాహనాన్ని సమకూర్చడంతో గంట 40 నిమిషాల్లో అంబులెన్స్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు సికింద్రాబాద్ యశోదకు దవాఖానకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హాస్పిటల్లోనే ఉంటూ దగ్గరుండి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో సుదర్శన్‌రెడ్డికి వైద్యం అందిస్తున్నారు.
దవాఖానకు తరలివచ్చిన ముఖ్య నేతలు
సుదర్శన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారని తెలియగానే బీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు రోహిణి హాస్పిటల్‌కు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, బానోత్ శంకర్‌నాయక్, మార్తినేని ధర్మారావు, మాజీ మేయర్ డాక్టర్ టీ రాజేశ్వర్‌రావు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేశ్, గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు, సంతోష్‌రెడ్డి, నాయకులు వద్దిరాజు గణేశ్, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు చేరుకొని సుదర్శన్‌రెడ్డిని చూసి చలించిపోయారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడించారు. సుదర్శన్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించే వరకు దవాఖాన పరిసరాలు జనసందోహంతో నిండిపోయాయి.
డాక్టర్ మమతకు అభినందనలు
రోహిణి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ మమతారెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మమతారెడ్డి కొద్దిరోజుల క్రితం మరో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును సైతం ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో రోహిణి హాస్పిటల్‌కు తీసుకురాగా, మమతారెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఏకంగా 11 సార్లు సీపీఆర్ చేసి ధర్మారావుకు ఊపిరిపోశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయాల్లో మెరుగైన చికిత్స అందించిన మమతారెడ్డికి అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డికి వేగంగా చికిత్స అందించి వైద్య సేవలో డాక్టర్ మమతారెడ్డి స్ఫూర్తిదాయకంగా నిలిచారని హరీశ్‌రావు తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. పట్టువదలకుండా అసాధారణమైన అంకితభావంతో మమత చూపిన తెగువకు సెల్యూట్ అంటూ అభినందనలు తెలిపారు.

హనుమకొండలోని రోహిణి దవాఖాన నుంచి బయటకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్ తదితరులు

పెద్ది సుదర్శన్‌రెడ్డి చికిత్స పొందుతున్న విషయం తెలిసి హనుమకొండలోని రోహిణి దవాఖాన వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు

హనుమకొండలోని రోహిణి దవాఖాన వద్ద పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను ఓదారుస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్