ఈనెల 11వ తేదీ బుధవారం మన ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుంచుకొనదగిన రోజులలో ఒకటిగా నిలుస్తుంది. ఆరోజు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్ గాంధీ, తమ హక్కులు కాపాడటం లేదంటూ స్పీకర్ ఓం బిర్లాపై తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తారు. ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది గాని, అటువంటి అసాధారణ తీర్మానం సభ ముందుకు రావడం గత 40 సంవత్సరాలలో అది మొదటిసారి. సరిగా అదే రోజున తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఒక తీర్పులో దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. ఏది జరిగితే అటువంటి ఆధారాలు ఉన్నట్లో ఆయన నిర్వచించినట్లయితే మన ప్రజాస్వామ్యానికి చాలా మేలు కలుగుతుంది.
మరునాడు 12వ తేదీ గురువారం నాడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలో మాట్లాడుతూ, నిబంధనలు ఎవరికైనా ఒకే విధంగా వర్తిస్తాయని, తాను అదే ప్రకారం సభను నిర్వహిస్తున్నానని, ఎవరికి తోచినట్లు వారు మాట్లాడేందుకు అవకాశం ఉండదని అన్నారు. స్పీకర్ల వ్యవహరణ తీరుపై వ్యాఖ్యానించేందుకు సభ్యులకు కొంత వెసులుబాటు ఉండవచ్చు గానీ, సాధారణ పౌరులకు ఎంత వాక్ స్వాతంత్య్రం ఉండేదీ తెలియదు. ఏ మాట సభాహక్కుల పరిధిలోకి వస్తుందో, ఏది రాదో, ఏ అభిప్రాయానికి ఎటువంటి నిర్వచనం చెప్పబడుతుందో కూడా తెలియదు.
అందువల్ల సభాపతుల వ్యవహరణం గురించి వ్యాఖ్యానించేందుకు, తమ అభిప్రాయాలను నిజాయితీగా చెప్పేందుకు తమకు గల వాక్ స్వాతంత్య్రం ఎంతో తెలియక ఈ ‘అతిపెద్ద’ ప్రజాస్వామ్య దేశంలోని పౌరులు తమ ఆలోచనలను ఎప్పుడూ అణచుకుంటూనే ఉంటారు. కోర్టు తీర్పులకు ఉద్దేశాలను ఆపాదించనంత వరకు ఆ తీర్పుల మంచి చెడులపై స్వేచ్ఛగా వ్యాఖ్యానించే వాక్ స్వాతంత్య్రం పౌరులకు ఉంటుందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు కొంతకాలం క్రితం స్పష్టం చేసింది. మరి అదేవిధంగా ఉద్దేశాలను ఆపాదించకుండా స్పీకర్ల వ్యవహరణలోని మంచి చెడులుగా తమకు తోచిన అభిప్రాయాలను వెల్లడించే వాక్ స్వాతంత్య్రం కూడా ఈ దేశ పౌరులకు ఉన్నదో లేదో, ఒకవేళ లేనట్లయితే ఎన్నటికి లభిస్తుందో, అసలు ఎప్పటికైనా లభిస్తుందో లేదో తెలియదు.
అయితే ఒకందుకు సంతోషించాలి. ఏ విషయం గురించి అయినా స్వేచ్ఛగా రాయలేకపోయినా, ప్రసంగాల రూపంలో రికార్డు చేయలేకపోయినా, మనలో మనం ఆలోచనలు చేసేందుకు, మనలో మనం మాట్లాడుకునేందుకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంది. అవి వారి వరకు చేరవు గనుక. అది రాజ్యాంగమో, సభా నిబంధనలో, కోర్టు తీర్పులో ఇచ్చే స్వేచ్ఛ కాదు. మనుషులకు, సమాజాలకు ప్రకృతి సిద్ధంగా లభించేది. ఆ ప్రకారం స్పీకర్ ఓం బిర్లా వ్యవహరణను, స్పీకర్ ప్రసాద్‌కుమార్ తీర్పులను గమనిస్తూ వస్తున్న పౌరులు తమ అభిప్రాయాలను తాము ఏర్పరచుకోగలరు. తమలో తాము స్వేచ్ఛగా వ్యాఖ్యానించుకోగలరు. ఇందులోని ఒక గొప్పతనం ఏమంటే, అంతిమంగా చట్టసభలు, న్యాయస్థానాలు ఏవి ఎప్పుడు, ఎట్లున్నా, ఎట్లా లేకపోయినా, శాశ్వతంగా నిలిచి కొనసాగేది సమాజం మాత్రమే. మనుషుల ప్రాథమికమైన అంతిమమైన విధేయత కూడా సమాజానికే. వారు ఏ వ్యవస్థలనైనా, అవి ఎవరు సృష్టించినవైనా, చివరకు తామే ఏదో ఒక దశలో సృష్టించినవి అయినా, తాము మెచ్చినంత కాలం కొనసాగించి, నచ్చనప్పుడు కూలదోయగలరు. ఇది మానవ సమాజాల చరిత్ర పొడవునా కనిపిస్తుంది.
తెలంగాణ స్పీకర్ తీర్పు స్పీకర్ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని, గౌరవాన్ని ఎంతవరకు నిలబెడుతుందో లేక హీనపరుస్తుందో తిరిగి ప్రజలే తమలో తాము చర్చించి నిర్ణయించగలరు. స్పీకర్లలో ఎవరేమిటన్నది ఒక రోజున చరిత్ర కూడా తన తీర్పు తాను చెప్పగలదు.
ఈ చర్చ అంతటిలో చివరకు తేలే పాఠం ఏమంటే ఏ వ్యవస్థకైనా ప్రాణప్రదం అయ్యేది, దానిని నిలబెట్టి ఉంచేది సదరు వ్యవస్థ పట్ల సమాజపు విశ్వాసం, గౌరవం మాత్రమే. తమ హక్కులు, స్వేచ్ఛలు, మనుగడలు, భవిష్యత్తులో పురోగతి, ఆ వ్యవస్థల చేతిలో భద్రంగా ఉండగలవనే నమ్మిక మాత్రమే. ఆ నమ్మిక పోయినప్పుడు ఆ వ్యవస్థల ఉనికి అన్నదే నిరర్థకం. అది ప్రజాస్వామ్యమైనా సరే. అందువల్ల లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిందా ఓడిందా అన్నది కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ప్రతిపక్షం తీర్మానం ఇచ్చిందా లేదా అన్నది కూడా కాదు. ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి వారి కారణాలు వారికి ఉంటాయి. కానీ స్పీకర్‌ను గమనిస్తున్న పౌరులకు కలుగుతున్న అభిప్రాయం ఏమిటన్నది ముఖ్యం. వారి అభిప్రాయం స్పీకర్‌కు సానుకూలంగా ఉన్నట్లయితే అవిశ్వాస తీర్మానం గెలిచినా ఓడినట్లే. సానుకూలంగా లేకపోతే ఓడినా గెలిచినట్లే. ఇంకా చెప్పాలంటే, ఆయన పట్ల అవిశ్వాసాన్ని ప్రతిపక్షం ఇవ్వకపోయినా ప్రజలు తామే ఇచ్చి గెలిపించడం అవుతుంది.
1952లో మొదటి లోక్‌సభకు జి.వి.మావ్లంకర్ సభాపతి అయిన తర్వాత ఇప్పుడు ఓం బిర్లా 17వ స్పీకర్‌గా ఉన్నారు. ఒక స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం రావడం 74 సంవత్సరాలలో ఇది నాలుగవసారి. ఆ వివరాలలోకి వెళ్ళనక్కరలేదు గాని, ఇదే రాహుల్ గాంధీకి చెందిన కాంగ్రెస్ పార్టీ స్పీకర్లలో ఇటీవలి కాలానికి వస్తే బలరాం జాఖడ్, శివరాజ్ పాటిల్ తమ బాహాటమైన పక్షపాత ధోరణుల వల్ల తీవ్రమైన విమర్శలకు గురయ్యారు. గమనించవలసింది ఏమంటే, వారిని అప్పుడు మీడియా సైతం బాహాటంగా విమర్శించింది. అయినా వారిద్దరూ గాని, అప్పటి కాంగ్రెస్ నాయకత్వం గాని మీడియాను సభాహక్కుల పేరిట విచారణకు ఈడ్వలేదు. స్వయంగా వారిద్దరూ మీడియాతో మునుపటి వలెనే సుహృద్భావ సంబంధాలు కొనసాగించారు. తమ చాంబర్లో కలిసినప్పుడు పార్టీ అనుబంధం వల్ల అట్లా వ్యవహరించక తప్పటం లేదని వాపోయేవారు. మీడియాకు అటువంటి స్వేచ్ఛను ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ గాని, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గాని ఇవ్వగలరా? తెలియదు.
క్రమంగా మన ప్రజాస్వామిక వ్యవస్థలు ఒక్కటొక్కటిగా పతనమవుతున్నాయనటానికి మరొక దృష్టాంతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు ఈ నెల 13న పార్లమెంటు ఉభయ సభలలో నోటీసులు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడటం. ఓటర్ల జాబితాల సవరణ పేరిట ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యల పట్ల బీజేపీ కూటమికి తప్ప దేశంలో మరే పార్టీకి గాని, మనకు కనిపిస్తున్న మేర పౌరులకు గాని విశ్వాసం కలగటం లేదు. కేవలం బీజేపీ కూటమికి అనుకూలం కావడం కోసమే జాబితా సవరణలు జరుగుతున్నాయనే అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇక్కడ కూడా సమస్య తిరిగి అదే. జ్ఞానేశ్‌కుమార్ ఉంటారా పోతారా అన్నది కాదు ప్రశ్న. ఎన్నికల సంఘం వంటి ఒక కీలకమైన వ్యవస్థ పట్ల ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేకుండా పోతే ఆ సంఘానికి గాని, అసలు ప్రజాస్వామ్యానికి గాని అర్థం ఏమిటి? అదొక జీవచ్ఛవ ప్రజాస్వామ్యం అన్నమాట. ఇటువంటి అనేకానేక పరిస్థితుల కారణంగానే ఒక ప్రశ్న పదేపదే తలెత్తుతుంది. మనది ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని‘ ముఖ్యంగా రాజకీయ నాయకులు అవకాశం వచ్చినప్పుడల్లా సగర్వంగా చాటుతుంటారు. ‘అతిపెద్దది‘ కావడం అనే సైజు మాట సరే. కానీ ‘అత్యుత్తమమైన‘ ప్రజాస్వామ్యం కూడానా? ఉత్తమ లక్షణం లేనప్పుడు సైజు లక్షణం ఉంటే సరిపోతుందా?
తెలంగాణ విషయానికి వద్దాము. హర్యానాలో 1967లో గయాలాల్ అనే స్వతంత్ర ఎమ్మెల్యే మంత్రి పదవిని ఆశించి ఒక్కరోజులో మూడు పార్టీలు మారినప్పటి నుంచి ‘ఆయారాం గయారాం’ అనే మాట మన రాజకీయ నిఘంటువులో వచ్చి చేరింది. ఆ సంస్కృతిని అరికట్టేందుకు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ తాను 1984లో ప్రధాని అయిన మరుసటి సంవత్సరమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని పదవ షెడ్యూలులో చేర్చారు. అందుకు ప్రతిపక్షాల నుంచి, నిపుణుల నుంచి, ప్రజల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రశంసలు పొందారు. అప్పటినుంచి ఆయనకే చెందిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కేంద్రంలో, రాష్ర్టాలలో కూడా రాజీవ్ గాంధీ కళ్ళలో పదేపదే దుమ్ము కొడుతూ, ఆయన చేసిన చట్టాన్ని చిత్రవిచిత్రమైన ఎత్తుగడలతో వమ్ము చేస్తూ వస్తున్నది. ఒకవేళ ఇతర పార్టీలు ఆ పని చేస్తే వారిని దోషులుగా నిలబెడుతూ నీతివంతమైన చట్ట పరిరక్షకులము తామేనని దేశానికి చెప్పాలి. కానీ చేస్తున్నది ఏమిటి? రాజీవ్ గాంధీకి వెన్నుపోటు పొడవడం. ప్రస్తుత సందర్భంలో ఆయన కుమారుడు ఆ విధంగా తండ్రికి వెన్నుపోటు పొడుస్తున్నారు కేవలం అధికారం కోసం.
తెలంగాణ స్పీకర్ ఆ పదిమంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా పార్టీ ఫిరాయించారనటానికి ఆధారాలు లేవని చెప్పిన తీర్పుపై స్వేచ్ఛగా వ్యాఖ్యానించే ప్రజాస్వామిక అవకాశం మనకు ఉందో లేదో తెలియదు. ఇంగ్లీషులో ‘ఫియర్ ఆఫ్ ద అన్నోన్’ అన్నట్లు ఒక విషయంపై స్పష్టత లేనప్పుడు, ఆ అస్పష్టత అనే అంధకారానికి మనం భయపడుతూనే ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం అయినా, మనకు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం ఉన్నా, ఉద్దేశాలను ఆపాదించనప్పుడు తీర్పులపై స్వేచ్ఛగా వ్యాఖ్యానించవచ్చునని సుప్రీంకోర్టు ప్రకటించినా. ఇవన్నీ ఎట్లున్నా పైన చెప్పుకున్నట్లు అంతిమంగా ప్రజాభిప్రాయం ఏమిటన్నదానిని బట్టి వ్యవస్థల విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణ స్పీకర్ తీర్పు స్పీకర్ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని, గౌరవాన్ని ఎంతవరకు నిలబెడుతుందో లేక హీనపరుస్తుందో తిరిగి ప్రజలే తమలో తాము చర్చించి నిర్ణయించగలరు. స్పీకర్లలో ఎవరేమిటన్నది ఒక రోజున చరిత్ర కూడా తన తీర్పు తాను చెప్పగలదు.
పైన చెప్పుకున్నట్లు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది రాహుల్ తండ్రి రాజీవ్. ఇప్పుడు ఒక స్పీకర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆయనపై ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని రాహుల్ తెచ్చారు. మరొక స్పీకర్ వరుసగా చెప్తున్న తీర్పుల విషయమై ఇక్కడి తమ పార్టీకి ఆయన ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారో తెలియదు. ఇక్కడి పార్టీ ఆ తీర్పులను హర్షించటం మాత్రం ప్రజలకు కనిపిస్తున్నది. ఒకవైపు తండ్రి రాజీవ్ గాంధీ, మరొకవైపు లోక్‌సభ స్పీకర్, ఇంకొకవైపు తెలంగాణ స్పీకర్.. ఈ ముక్కోణపు దృశ్యంలో రాహుల్ గాంధీ ఎక్కడ నిలిచి ఉన్నట్లు? ఎటు అవసరమైతే అటు ఉపయోగించుకునేందుకు వీలయ్యే ’జోకర్ ఇన్ ద ప్యాక్’గా మాత్రమేనా?
రాహుల్ ప్రత్యక్ష రాజకీయాలలోకి 2004 లో ప్రవేశించిన తర్వాత ఈ 22 సంవత్సరాల సుదీర్ఘకాలంలో సంపాదించిన ఒకేఒక్క బిరుదు ‘పప్పూ’. అనగా దద్దమ్మ. ఆ బిరుదు ఇచ్చింది బీజేపీయే కావచ్చు. కానీ దానితో ఏకీభవించేవారు కాంగ్రెస్‌లోనూ చాలామందే ఉన్నారు. కనుకనే తనకు బదులు తన చెల్లెలికి అధికారం అప్పగించాలనే మాటలు ఇటీవల మరొకమారు వినవస్తున్నాయి. ప్రియాంక సమర్థత ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ మాటలు రావడం అంటేనే రాహుల్ గాంధీ ‘పప్పూ’ అన్న మాటకు ఏకగ్రీవ ఆమోదం లభించటమన్నమాట.
టంకశాల అశోక్