జైపూర్: ఎబోలా వైరస్(Ebola Virus) లక్షణాలు ఉన్న ఉగాండా మహిళ రాజస్థాన్ చేరుకున్నది. ఆ మహిళను జైపూర్ ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆమె ఎబోలా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను తక్షణమే నగరంలో ఆర్యూహెచ్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. షార్జా నుంచి ఆమె శుక్రవారం జైపూర్ చేరుకున్నది. కఠినమైన ఐసోలేషన్‌లో ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఆ మహిళ నుంచి శ్యాంపిళ్లను సేకరించి.. తదుపరి విశ్లేషణ కోసం పుణె ల్యాబ్‌కు పంపారు.
ప్రమాదకర ఎబోలా వైరస్‌తో పోలిన లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే ఆమెలో ఎబోలా ఇంకా నిర్ధారణ కాలేదని రాజస్థాన్ వైద్య కళాశాల సూపరిండెంట్ అనిల్ గుప్తా తెలిపారు. రిపోర్టు అందిన తర్వాతే ఇన్ఫెక్షన్ నిర్ధారణ జరుగుతుందన్నారు. అయితే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఓ సుడాన్ వ్యక్తిని కూడా ఎబోలా అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతర్జాతీయ ప్రయాణికులు నిర్వహిస్తున్న థర్మల్ స్క్రీనింగ్‌లో ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.