పాలకుర్తి రూరల్, జనవరి 7: వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఈ విషయంలో నాయకులు అధైర్య పడొద్దని సూచించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను త్వరితగతిన అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిధుల కొరత పేర జాప్యం చేస్తే ఊరుకోమన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపై ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఏదో ఒక విధంగా హామీల అమలును దాట వేసేలా ప్రభుత్వం యోచిస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని, ఖజానా ఖాళీగా ఉందని ఆరోపణలు చేస్తూ హామీల అమలును వాయిదా వేసేందుకు సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు.
రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుతమైన పథకాలు అమలు చేశామని తెలిపారు. పౌరసరఫరాలు, విద్యుత్ శాఖల్లో అప్పులు పెరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో సంపదను పెంచామనే విషయాన్ని గుర్తించడంలేదన్నారు. రిజర్వుబ్యాంక్ నిబంధనలకు లోబడి అప్పులు తెచ్చామని ఆయన గుర్తు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల మేరకు వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు టెం డర్ల ప్రక్రియ పూర్తయిందని, వీటి పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి కోరారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డి, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, నాయకులు పాము శ్రీనివాస్, కాటబత్తిని రమేశ్, లకావత్ సురేశ్‌నాయక్ పాల్గొన్నారు.