తొర్రూరు, అక్టోబర్ 3 : రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో నిర్వహించే కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితోపాటు పలువురు నేతలు హాజరుకానున్నారు.
ఈ మేరకు పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా వాటి ఊసే లేదని మండిపడ్డారు. రైతు భరోసా ఏదని, రైతు బంధు నిధులను రుణమాఫీ కోసం మళ్లించి ఇచ్చిన హామీ అమలు చేశామని ప్రకటించుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు.
ఈ ధర్నాకు దగా పడ్డ రైతులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా రుణమాఫీ పొందని రైతుల వివరాలను కార్యకర్తలతో చర్చించి ధర్నా విజయవంతంపై పలు సూచనలు చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, డాక్టర్ పీ సోమేశ్వర్ రావు, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, రామిని శ్రీనివాస్, నలమాస ప్రమోద్, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, కుర్ర శ్రీనివాస్, కర్నె నాగరాజు, టీ వీరభద్రరావు, శామకూరి ఐలయ్య, కాలూనాయక్, వెంకన్న, పూలమ్మ, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.