ఖానాపురం/సంగెం/చెన్నారావుపేట, సెప్టెంబర్ 2: ఖానాపురం మండలం పాకాల ఆయకట్టులోని తుంగబంధం, సంగెం, జాలుబంధం కాల్వలకు గండ్లు పడడంతో నీరంతా పంట పొలాల మీదుగా వృథాగా పోతున్నది. వెంటనే అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సంగెం కాల్వ నీళ్లు పంట పొలాల్లోకి చేరడంతో ఇసుక మేటలు వేశాయి. పత్తి చేన్లు నేలకొరిగాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే, పాకాల సరస్సు మత్తడి దుంకుతున్నది.
దీంతో అశోక్‌నగర్ శివారు లోలెవల్ కాజ్‌వేపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తగూడ, నర్సంపేటకు సోమవారం రెండో రోజు రాకపోకలు నిలిచిపోయాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి, రెవెన్యూ సిబ్బంది కాపలా కాస్తున్నారు. కాజ్‌వేను తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎస్సై రఘుపతి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సంగెం మండలం ఎల్గూర్ పెద్ద చెరువు మత్తడి దుంకుతున్నది. సంగెం, కుంటపల్లి, కాట్రపల్లి, చింతలపల్లి చెరువులు అలుగు పోస్తుండడంతో ఆ నీరంతా ఎల్గూర్ పెద్ద చెరువులోకి చేరుతున్నది. మండలంలోని అన్ని చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగెం మండలం గొల్లపల్లి శివారులోని మహ్మద్సాబ్ కుంటకు బుంగ పడింది. ఐబీ అధికారులు సందర్శించి గ్రామస్తుల సహాయంతో జేసీబీతో బుంగను పూడ్చారు. వంజరపల్లికి చెందిన గనిపాక కుమారస్వామి ఇంట్లోకి నీరు చేరడంతో తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో రవీందర్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. సంగెంలో హెల్ప్‌డెస్క్ 24 గంటలపాటు పని చేస్తుందన్నారు. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో మక్కజొన్న పంట నేలవాలింది. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరి పంట నీట మునిగింది. కోపాకుల చెరువు మత్తడి ఉధృతికి చాలా ఎకరాల్లో వరి పంట రెండు రోజులుగా నీటిలోనే మునిగి ఉంది. పత్తి పంట కూడా దెబ్బతిన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నర్సంపేటరూరల్: నర్సంపేట మండలంలోని అన్ని చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. మాదన్నపేట శివారులోని మాదన్నపేట పెద్ద చెరువు సోమవారం రెండు ఫీట్ల మందంతో మత్తడి పోసింది. మండలంలో వందలాది ఎకరాల్లో వరి, పత్తి, మక్కజొన్న పంటలు నీట మునిగాయి. మాదన్నపేట, గురిజాల, లక్నేపల్లి శివారుల్లోని లో-లెవల్ కాజ్‌వేలను తాకుతూ వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. గురిజాల, లక్నేపల్లి, మాదన్నపేట, ముత్తోజిపేటలో పలు పాత ఇండ్లు వర్షాలకు కూలిపోయాయి. నాగుర్లపల్లి శివారు నర్సంపేట-నల్లబెల్లి ప్రధాన రహదారిలోని లో-లెవల్ కాజ్వే పైనుంచి వరద నీరు ప్రవహించింది. మాదన్నపేట పెద్ద కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు పరిశీలించారు.
గిర్మాజీపేట/ఖిలావరంగల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హంటర్‌రోడ్‌లోని లోతట్టు ప్రాంతాలైన బృందావన్, ఎన్టీఆర్నగర్, సాయినగర్కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ఆయా కాలనీ వాసులకు కంటిమీద కునుకులేకుండా అవుతున్నది. ఎన్నో ప్రభుత్వాలు మారినా లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసున్నారు. కాగా, పునరావాస కేంద్రా ల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ఉదయం టిఫిన్, భోజన సదుపాయాలు కల్పించి, దుప్పట్లు పంపిణీ చేశారు.
ఖిలావరంగల్/కరీమాబాద్/కాశీబుగ్గ/నెక్కొండ/పర్వతగిరి: ఖిలావరంగల్‌లోని అగడ్త ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శివనగర్, మైసయ్యనగర్ జలదిగ్బంధంలో ఉన్నాయి. రోడ్డుకు అడ్డుగా పడిపోయిన చెట్టును జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు. శివనగర్‌లో నాలాలు, డ్రైనేజీలను శుభ్రం చేసి వరద నీటిని మళ్లించారు. మైసయ్యనగర్‌లో ఇండ్లలో వరద నీరు ఉండడంతో మహిళలు బకెట్లతో తోడి బయట పోశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు బాబు, నలిగంటి రత్నమాలతోపాటు నాయకులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ 37వ డివిజన్ గిరిప్రసాద్‌నగర్‌లో ముంపు ప్రాంతాల ప్రజలకు కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ దుప్పట్లు పంపిణీ చేశారు.
మధ్యకోటలో పంట పొలాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో వ్యవసాయ క్షేత్రాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 41వ డివిజన్లోని పలు కాలనీలను కార్పొరేటర్ పోశాల పద్మ గ్రేటర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ఆహారం అందజేశారు. ఆమె వెంట పోశాల స్వామి, బల్దియా అధికారులు ఉన్నారు. వరంగల్ 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్, సాయిగణేశ్కాలనీ, లక్ష్మీగణపతికాలనీ, మధురానగర్, సుందరయ్యనగర్, 19వ డివిజన్లోని వివేకానందకాలనీ, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌రోడ్డులో వరదనీరు డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లింది. 20 డివిజన్లోని పద్మనగర్, శాంతినగర్‌లో బురద చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
12వ డివిజన్లోని లోతట్టు ప్రాంతాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 19వ డివిజన్ గాంధీనగర్‌లో కాంగ్రెస్ 19వ డివిజన్ అధ్యక్షుడు దాసరి రాజేశ్ ఆహారం పంపిణీ చేశారు. నెక్కొండ ఊరచెరవు మత్తడి వద్ద పడిన బుంగను ఆదివారం రాత్రి రెవెన్యూ, పోలీసు అధికారులు పూడ్చి చెరువును ప్రమాదం నుంచి తప్పించారు. వెంకటాపురం కాజ్వే వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేశారు. పెద్దకోర్పోలు సమీపంలో బీటీరోడ్డు సైడ్ బర్మ్ కొట్టుకుపోగా తాత్కాలిక మరమ్మతులు చేశారు. పర్వతగిరి మండలంలోని బూరుగుమళ్ల గ్రామంలో చెరువు మత్తడి ఉధృతంటీ ప్రవహించడంతో వరి పొలాల్లో ఇసుక మేటలు వేసింది.