నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం పొద్దంతా కురిసిన వానకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాలు నీటమునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. కల్వర్టులు, రహదారులపై నుంచి వరద పోటెత్తడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో సగటు వర్షపాతం 5.96 సెంటీమీటర్లు కాగా, అత్యధికంగా నెక్కొండ మండలంలో 10.17సెంటీ మీటర్లుగా నమోదైంది. భారీ వర్షానికి చెన్నారావుపేటలో కట్టమ్మకు చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. జల్లి గ్రామంలో రేకులషెడ్ పైకప్పు ధ్వంసమైంది.
పర్వతగిరి మండంల పెద్దతండాలో ఇండ్లల్లోకి నీరు చేరి తండావాసులు ఇబ్బందిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు, తొర్రూరు, నర్సింహులపేట, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ పట్టణంలోని నిజాంచెరువు, మున్నేరువాగు, గార్ల మండలంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తొర్రూరు మండలంలో గంటపాటు కురిసిన వర్షానికి అమ్మాపురం, ఎలికట్ట చెరువులు మత్తడి పోస్తున్నాయి. పద్మశాలీ బజార్ ఎస్బీఐ రోడ్డులోని ఇండ్లలోకి వరదనీరు చేరి స్థానికులు ఇబ్బందిపడ్డారు.
పెద్దవంగర మండలంలోని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ములుగు జిల్లా ములుగు మండలంలోని సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్యలో బొగ్గులవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జగ్గన్నగూడెం, సర్వాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరునాగారం మండలంలో పిడుగుపాటుకు పలు ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. దొడ్ల, ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంగపేట మం డలం మంగపేట-బోరునర్సాపురం గ్రామాల మధ్య గౌరారం వాగు ఉధృతి బోరునర్సాపురం తీరం వైపునకు మళ్లడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాడ్వాయి మండ లం మేడారంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మళ్లీ మత్తడి పోస్తున్నది. వెంకటాపురం(నూగూరు) మండలం మొర్రవానిగూడెం గ్రామానికి చెందిన మల్లమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి, శంకరంపల్లి, బొప్పారం, దామెరకుంట తదితర గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. గోపాల్పూర్ గ్రామంలో దుర్గం రాజు ఇల్లు ధ్వంసమైంది. హనుమకొండ, జనగామ జిల్లాలో మోస్తరుగా వర్షం కురిసింది. కాగా, వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్లు, మండలస్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
గోవిందరావుపేట : ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్యలో జనగలంచ వద్ద వరద ఉధృతి కారణంగా ఎన్‌హెచ్-163పై శనివారం సాయంత్రం రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మేడారం మీదుగా మంగపేటకు వాహనాలు తరలిస్తున్న క్రమంలో ఆ రోడ్డులో వెంగళాపురం సమీపంలో బాంబులగడ్డ ఒర్రె ఉప్పొంగడంతో అటువైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మేడారం వచ్చిన భక్తులను తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఒర్రె దాటించారు. రెండు వైపులా రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు పస్రాలోనే వాహనాలను నిలిపివేయగా, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.
వెంకటాపూర్ : ములుగు జిల్లాలో బొగత జలపాతం, లక్నవరం, రామప్ప సరస్సు తదితర పర్యాటక ప్రాంతాల సందర్శనను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు పర్యాటక ప్రాంతాలకు రాకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.