కురవి, అక్టోబర్ 16 : రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితి. వానకాలంలో బాడువ (బురదగా ఉండేవి) పొలాల్లో ఎక్కువ రోజులకు పంట చేతికొచ్చే దొడ్డు రకం వరిపంటను అన్నదాతలు సాగుచేస్తారు. 150 రోజుల వ్యవధిలో పంట వస్తే భూమి గట్టి పడుతుందని వీటిని సాగు చేస్తారు. దీనికి తోడు అప్పటికే చుట్టూ ఉన్న స్వల్ప కాలిక వరి కోతలు పూర్తవ్వడం వల్ల బాడువ పొలాల్లోని పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి తరలించుకుంటారు.
ఇందులో భాగంగానే ఈ వానకాలంలో సైతం దీర్ఘకాలిక దొడ్డు రకం వరి విత్తనమైన 1001 కావాలని గుండ్రాతిమడు గు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు స్థానిక రైతులు వెళ్లారు. అయితే ఆ విత్తనాలు లేకపోవడంతో జేజీఎల్24423 విత్తనాలను ఇవ్వడంతో జూలైలో సాగు చేశారు. తీరా నారు పోసిన సమయం నుంచి చూస్తే కేవలం 70 రోజుల్లోనే పంట ఏపుగా పెరిగి కంకులు పోసింది. పైగా పూర్తి స్థాయిలో కంకి పోయకపోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో ఈ విత్తనాలు కొనుగోలు చేసిన రైతు లు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం పంట కోయాలంటే చుట్టూ ఉన్న పొలాల్లోనుంచి వెళ్లడం సాధ్యం కాదని, మరో రెండు నెలలు ఆగాల్సి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతు న్నారు. అప్పటి వరకు పంట మొత్తం నేలపాలవుతుందని కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి ఇంటికెట్లా తీసుకొచ్చేదంటూ ఆందోళన బాట పట్టారు. బుధవారం వరి కంకులను పట్టుకొని గుండ్రాతిమడుగు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
గుండ్రాతిమడుగు రైతులు ఫిర్యాదు చేయడంతో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం. వారి ఆదేశాల మేరకు రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం.
– నర్సింహారావు, ఏవో, కురవి
నాకు గుండ్రాతిమడుగులో ఐదెకరాల బాడువ పొలం ఉంది. సొసైటీకి వెళ్లి 1001 రకం వరి విత్తనాలు కావాలని అడిగా. వారిచ్చిన విత్తనాలను సాగు చేస్తే 150 రోజులకు వచ్చే పంట కేవలం 70 రోజుల వ్యవధిలోనే చేతికి వచ్చింది. వెంటనే ఈ రకం పంట సాగుచేసిన రైతులం భయపడి వ్యవసాయాధికారిని కలిశాం. వారు వచ్చి పంటను చూశారు. గట్టిగా అడిగితే మేమేం చేయలేం… ఎవరి వద్ద విత్తనం కొన్నారో అక్కడే అడగండి అంటున్నారు. బాడువ పొలం భూమి దిగుబాటు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏటా దొడ్డు రకం వేస్తాం. చుట్టూ ఉన్న పొలాలు మరో రెండు నెలలు దాటితే కాని కోయరు. ఇప్పుడు చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోవాల్సిందే. ఇప్పటివరకు సాగుకోసం సుమారు రూ. 1.50 లక్షల వరకు ఖర్చయ్యింది.
– కుంభం మైసయ్య, రైతు, గుండ్రాతిమడుగు