వర్ధన్నపేట/పర్వతగిరి, ఆగస్టు 30 : రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు డిమాండ్ చేశారు. వర్షాలు లేక, యూరియా లభించక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలన్నారు.
యూరియా బస్తాలు దొరకక విసిగిపోయిన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏబీతండా శివారు ఉట్టితండాకు చెందిన రైతు భూక్యా బాలు తన రెండెకరాల పత్తి పంటను కుటుంబంతో కలిసి శుక్రవారం పీకేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఎర్రబెల్లి పీకేసిన పత్తి పంటను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. బాధిత రైతు బాలు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో అధికారులతో అంచనా వేసి అందుకు తగినట్లుగా ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందించాల్సి ఉందన్నారు.
సాగుకు ఆరు నెలల ముందే సరిపడా యూరియా, ఇతర ఎరువులు తెప్పించాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సూచనల మేరకు కేంద్ర మంత్రితో మాట్లాడి ముందస్తుగా యూరియా తీసుకొచ్చామని, అందువల్లే పదేళ్లపాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి, అధికార యంత్రాంగం కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో విఫలం కావడంతోనే ప్రస్తుతం రైతులు ఒకటి, రెండు బస్తాల కోసం నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదన్నారు.
రేవంత్‌రెడ్డి అబద్దపు హామీలకు మోసపోయిన రైతులు కాంగ్రెస్‌కు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారని, ఇప్పుడు ఎందుకు వేశామా? అని సీఎంను, మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు రాష్ట్రమంతా కనిపిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు. యూరియా కోసం రోజుల తరబడి దుకాణాల చుట్టూ తిరిగిన భూక్యా బాలు పంటలు పాడైపోతున్నాయనే విషయంలో గొడవలు జరగడంతో ఆత్మహత్యకు యత్నంచగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తి న్యాయం జరిగేలా చూస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.