వాతావరణం అనుకూలిస్తే.. వాణిజ్య పంటల్లో సిరులు కురిపించేది మిర్చి. వర్షాభావం.. చీడపీడలతో దిగుబడి రాక.. వచ్చిన పంటకు ధర లేక.. మార్కెట్లో అమ్ముకుంటే గిట్టుబాటు కాక.. సాగు ఖర్చులు కూడా కలిసిరాక రైతులు నష్టాలపాలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా మిర్చి పంటకు డిమాండ్ ఉన్నప్పటికీ ఈసారి దాని సాగును పట్టించుకోవడం లేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వానకాలంలో మక్కజొన్న, ఇతర పంటలవైపు మొగ్గు చూపడంతో వాటి విస్తీర్ణం గతంకంటే పెరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
– నర్సింహులపేట/ మరిపెడ అక్టోబర్ 14
గత సీజన్లో విదేశాలకు ఎగుమతు లు నిలిచిపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు మిర్చి సాగును తగ్గించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మక్కజొన్న, ఆయిల్ పామ్, బొప్పాయి సాగు చేస్తున్నారు. దీంతో ఆయా పంటల విస్తీర్ణం గతంకంటే ఈ సారి పెరిగింది. గతంలో మిర్చి క్వింటాలు రూ. 25 వేలు ధర పలుకగా, గతేడాది రూ. 10 వేలకు పడిపోయింది. దీనికి తోడు విదేశాలకు ఎగుమతులు నిలిపోవడంతో నిరుడు పం డించిన పంట ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలు, గోదాముల్లోనే నిల్వ ఉంది. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా గతంలో 70 నుంచి 80 వేల ఎకరాల్లో మిర్చి సాగు విస్తీర్ణం ఉండగా, ఈసారి అది 27 వేల ఎకరాల కు తగ్గింది. గతేడాది పండు మిర్చి ఏరేందుకు రోజు కూలీ రూ. 400 నుంచి రూ. 500 వరకు చెల్లించారు. అయితే గిట్టుబా టు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీ యజమానులు మిర్చి పంటను త్వరగా అమ్ముకోవాలని ఒత్తిడి చేస్తున్న ట్లు రైతులు చెబుతున్నారు. మారెట్లో విక్రయిద్దామంటే ప్రస్తుతం క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే ధర పలుకుతున్నదని, ఇప్పుడు అమ్ముకుంటే భారీగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఒకటి రెండు ఎకరాలు కూడా సాగు చేయడం కష్టంగా మారిందని అంటున్నారు. వర్షాభావానికి తోడు, గిట్టుబాటు ధర దక్కకపోవడమే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడానికి కారణమని రైతులు, అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది మూడెకరాల్లో మిర్చి పంట వేసిన. పెట్టుబడి రూ. 2 లక్షలు, కూలీలకు రూ.1.60 లక్షల దాకా అయ్యింది. మార్కెట్లో రేటు లేక 80 బస్తాల మిర్చిని కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన. ఇప్పుడు కూడా మార్కెట్లో ధరలేక అమ్మడంలేదు. రోజు రోజుకు తెచ్చిన డబ్బులకు వడ్డీ ఎక్కవవుతున్నది. ఈసారి మిర్చి పంట సాగు చేయాలంటేనే భయమైతాంది.
-జరుపుల బిక్కు, రైతు, జరుపుల తండా
గత ఏడాది నేను 1.30 ఎకరాల్లో మిర్చి పంట వేశాను. నాకు పెట్టుబడి రూ. 90 వేలు అయ్యింది. కేవలం 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దీనిని మార్కెట్లో రూ. 9 వేల చొప్పున అమ్మి పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు చెల్లించా. సరైన ధర లేకపోవడంతో మిర్చి పంట సాగుచేసి పూర్తిగా నష్టపోయా. ఆరుగాలం పడ్డ శ్రమ వృధా అయింది. అందుకే ఈసారి మిర్చి జోలికి పోలేదు.
– అజ్మీరా శ్రీను, రైతు, గుండెపూడి