నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 26 : యూరియా కోసం రైతులు వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ అష్టకష్టాలు పడ్డారు. మంగళవారం మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో ఎరువు కోసం సొసైటీల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాశారు. చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించారు. పలు చోట్ల టోకెన్లు ఇవ్వకపోవడంతో ఆందోళనలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇను గుర్తి మండల కేంద్రంలోని సొసైటీ వద్ద ఎంతకూ టోకెన్లు ఇవ్వకపోవడంతో కేసముద్రం నుంచి తొర్రూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎస్సై రైతులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింప జేశారు. కేసముద్రం సొసైటీ ఎదుట ఉదయమే బారులు తీరారు. అధికారులు 220 మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు.
మహబూబాబాద్ మండల కేంద్రంలో మూడు రోజుల క్రితంటోకెన్లు ఇచ్చిన వారికి మాత్రమే యూరియా ఇస్తామని మైక్‌లో ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు పీఏసీఎస్ వద్ద బారులు తీరారు. కొత్తగూడ మండలంలో ఎరువుల కోసం వర్షాన్ని లెక్క చేయక రైతులు అగ్రోస్ ఎదుట పడిగాపులు కాశారు. నర్సింహులపేట వ్యవసాయ సహకార సంఘం రైతులు చలికి వణుకుతూ క్యూలో నిలబడ్డారు. యూరియా అందని వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ వెళ్లిపోయారు.
జనగామ జిల్లా పాలకుర్తి ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం వద్ద రైతులు వానను సైతం లెక్క చేయకుండా ఉదయం 7గంటల నుంచే పడిగాపులు కాశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎరువుల గోదాము వద్ద యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించారు.
కాటారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదా ము ఎదుట అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు వచ్చి రైతులను క్యూలైన్లో ఉంచారు. ములుగు జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.