నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. అదునులోపే పంటకు యూరియా వేస్తే దిగుబడి వస్తుందని అన్నదాతలు ఎరువు కోసం రెండు నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు యూరియా ఎక్కడ దొరుకుతుందా..అని ఆలోచించడమే వారికి పనిగా మారింది. బస్తా యూరియా కోసం సొసైటీల ఎదుట రోజుల తరబడి పడిగాపులుగాయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇంకా ఎన్నిరోజలు నిలబడాలి.. మా బాధలు సర్కారుకు పట్టవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ పీఏసీఎస్ కేంద్రానికి యూరియా బస్తాలు రాగా, రైతులు మంగళవారం ఉదయాన్నే కేంద్రానికి వెళ్లి బారులు తీరారు.
ఓపిక నశించి చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి పడిగాపులుకాచారు. తీరా ఒకరికి ఒక బస్తా మాత్రమే ఇవ్వడంతో నిరాశతో వెళ్లిపోయారు. టేకుమట్ల మండలంలో బూర్నపల్లి రైతు వేదిక వద్ద రైతులు తెల్లవారుజామునుంచే వర్షంలో చెప్పులు క్యూలైన్లో పెట్టి పడిగాపులుగాచారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ పీఏసీఎస్‌కు 440 బస్తాల యూరియా రాగా, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి లైన్లో నిలబడ్డారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరారు.
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం తీయకముందే రైతులు యూరియా కోసం గేటు ఎదుట పడిగాపులుకాచారు. రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో రైతులు యూరియా కోసం బారులు తీరారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో రైతులు ఆందోళన చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి పీఏసీఎస్ గోదాము వద్దకు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు రైతులు యూరియా కోసం భారీగా తరలివచ్చారు. రోజంతా లైన్లో నిలబడ్డారు. చిన్నగురిజాలలో యూరియా టోకెన్ల కోసం రైతులు స్థానిక పాఠశాలలో బారులు తీరారు.
ఇటుకాలపల్లిలో రైతులు యూరియా కోసం బారులు తీరారు. కొందరికి మాత్రమే టోకెన్లు రాగా మిగిలిన వారంతా ఆందోళన బాటపట్టారు. ఇటుకాలపల్లి గ్రామం నర్సంపేట-మల్లంపల్లి ప్రధాన రహదారిలోని ఎన్‌హెచ్-365జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. నల్లబెల్లి మండలం రాంపూర్ గ్రామ రైతు వేదిక వద్ద తెల్లవార్లు చలిమంట కాగుతూ యూరియా కోసం పడిగాపులుకాచారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక రైతులు మంగళవారం గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా బస్తాలు ఇస్తరా? ఇయ్యరా? అంటూ నిరసన వ్యక్తం చేశారు. రాయపర్తి, పర్వతగిరి మండలాల్లోని రైతులు కేంద్రాల వద్ద యూరియా కోసం బారులు తీరారు.
పర్వతగిరి, సెప్టెంబర్ 16: యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రాణంమీదికొస్తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్ద తండాకు చెందిన ఓ మహిళా రైతు యూరియా బస్తాల టోకెన్ కోసం పీఏసీఎస్ కార్యాలయం గేటు ఎక్కి లోపలికి వెళ్లే క్రమంలో కిందపడడంతో కాలు విరిగింది. వివరాలిలా ఉన్నాయి. పెద్ద తండాకు చెందిన మహిళా రైతు లునావత్ కవిత పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో యూరియా బస్తాల టోకెన్ల కోసం మంగళవారం సొసైటీ కార్యాలయం వద్దకొచ్చింది. గేట్లు మూసివేయడంతో ఎలాగైనా యూరియా టోకెన్ తీసుకోవాలనే తపనతో పీఏసీఎస్ కార్యాలయం గేటు ఎక్కబోయింది. ఈక్రమంలో కింద పడిన కవిత కాలు విరిగింది. గమనించిన స్థానికులు కవితకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సబ్యులు పేర్కొన్నారు. యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా తమ ఉసురు తగులుతుందని రైతులు శాపనార్థాలు పెట్టారు.