Balayya – Venki | తెలుగు సినిమా చరిత్రలో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీలు ఎన్నో చూశాం. కానీ ఒకే కథ ఆధారంగా రూపొందిన రెండు సినిమాలు, ఒకే రోజు విడుదల కావడం మాత్రం అరుదైన సంఘటన. అలా 1989లో జరిగిన బాలకృష్ణ–వెంకటేష్ క్లాష్ అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా అభిమానుల ఆదరణ పొందిన నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ తనదైన ఇమేజ్ను నిర్మించుకున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1989 జూన్ 29న బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి విడుదలైంది. అదే రోజు వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం కూడా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రేక్షకులు సినిమాలు చూసిన తర్వాత షాక్ అయ్యారు. కారణం – రెండు చిత్రాల కథ ఒకటే కావడం. ఈ రెండు సినిమాలు మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన ఆర్యన్ ఆధారంగా తెరకెక్కాయి. ‘అశోక చక్రవర్తి’ ఆ చిత్రానికి అధికారిక రీమేక్ కాగా, ‘ధ్రువ నక్షత్రం’ మాత్రం అదే కథాస్ఫూర్తితో రూపొందించబడింది. ఓ సాధారణ యువకుడు తాను చేయని నేరానికి జైలుకు వెళ్లి, పరిస్థితుల ప్రభావంతో ముంబై మాఫియా డాన్‌గా ఎలా మారాడు? అనేది రెండు సినిమాల ప్రధాన కథాంశం.
‘అశోక చక్రవర్తి’ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌తో, భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కింది. దర్శకుడు ఎస్.ఎస్. రవిచంద్ర ఈ చిత్రాన్ని మాస్–సెంటిమెంట్ మిశ్రమంగా రూపొందించారు. ఇక ‘ధ్రువ నక్షత్రం’ను దర్శకుడు వై. నాగేశ్వరరావు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. ఇద్దరి సినిమాలకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించడం విశేషం. కథ ఒకటేనని తెలిసినా బయటకు వెల్లడించలేదనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైనా, ఫలితాల్లో మాత్రం భారీ తేడా కనిపించింది. ‘ధ్రువ నక్షత్రం’ మంచి విజయాన్ని సాధించగా, ‘అశోక చక్రవర్తి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ క్లాష్ ఇండస్ట్రీలో వివాదానికి దారి తీసింది. ఇప్పటికీ బాలకృష్ణ–వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల వెంకటేష్, బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలని ఆసక్తి వ్యక్తం చేయడం ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.