బచ్చన్నపేట సెప్టెంబర్ 12 : యూరియా కోసం అన్న దాతలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రతిరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కాగా, వారం రోజుల కింద ఇచ్చిన జిరాక్స్ పత్రాలకు మాత్రమే అధికారులు యూరియా సంచులు అందిస్తున్నారు. అవి కూడా సరిపోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం యూరియా కోత లేదని అంటుండగా ఇక్కడ మాత్రం రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే మండలంలోని కొన్నె గ్రామంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద యూరియా పొందేందుకు మబ్బులనే పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్లను కార్యాలయం ఎదుట లైన్లో పెట్టిన తీరు యూరియా కొరతకు నిదర్శనంగా మారింది. గత ప్రభుత్వంలో యూరియా కోసం ఏ ఒక్కరోజు రోడ్డుపైకి రాలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులందరికి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మండల రైతుల డిమాండ్ చేస్తున్నారు.