అన్నదాతల కోసం బీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమైంది. వానకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు, రైతుభరోసా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నది. ఈ మేరకు మాజీ మంత్రులు, అన్ని జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నిరసనలకు సిద్ధమవుతుండగా పెద్ద సంఖ్యలో రైతాంగం తరలివచ్చి కదంతొక్కనున్నది.
– హనుమకొండ, అక్టోబర్ 19
రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆదివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలకేంద్రాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గత ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు(రెండు సీజన్లు కలిపి) ఇస్తే తాము ఎకరాకు రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, వరుస ద్రోహాలను ఎండగట్టేందుకు రైతాంగం నేడు కదంతొక్కనున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రైతాంగాన్ని ఆదుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పన రైతుల ఖాతాల్లో జమచేసేది. అయితే గత ప్రభుత్వం కంటే పెంచి రూ.15వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగవేత ధోరణిలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రే మాట్లాడిన నేపథ్యంలో రైతాంగానికి అండగా నిలువాలని భావించింది. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను రైతాంగానికి గుర్తుచేయడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తలపెట్టిన నిరసనలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.