వరంగల్ ప్రతినిధి/మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ), మే 1 : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుంచి పం ట అమ్ముకునేంత వరకు కష్టాలు తీర డం లేదు. యాసంగిలో అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయి. అరకొర తప్ప మిగతా అన్ని కేంద్రాల్లోనూ కాంటాలు మొదలే కాకపోవడంతో రోజుల తరబడి అక్కడే పడిగాపులు పడాల్సి వస్తున్నది. వసతులు కల్పించక, గన్నీ సంచులు లేక, కొనుగో ళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ఆరబెట్టిన వడ్లు తడిసి రైతులు మరింత నష్టపోతున్నారు. దీనికి తోడు అధికారుల కొత్త నిబంధనలు వడ్లు అమ్ముకోలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. దీంతో మిల్లరు ఆశ్రయిస్తే తేమ, తాలు పేరుతో అగ్గువకు కొంటూ అన్నదాతకు అన్యాయం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు మరోసారి అన్యాయం చేస్తున్నది. వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. యాసంగి వరి కోతలు మొదలై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వడ్ల కొనుగోళ్లు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో సమస్యలే దీనికి కారణమవుతున్నాయి. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు మొదలు కాకపోవడంతో రైతులు అనివార్యంగా రైస్ మిల్లర్లపై ఆధారపడుతుండడంతో ఇదే అదనుగా తేమ పేరుతో కాంటాల్లో కోత పెట్టడంతో పాటు తాలుందని తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో అకాల వర్షాలు పడుతుండడం, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడుస్తుండడం, కాంటాలు కాకపోవడంతో అన్నదాతకు రైస్ మిల్లర్లే దిక్కవుతున్నారు.
అష్టకష్టాలు పడి యాసంగిలో సన్న వడ్లు పండించిన రైతులకు ఇప్పుడు ధరల కష్టాలు తప్పడంలేదు. రైస్ మిల్లర్లు బస్తాకు 42 కిలోలే తూకం వేయడం, తేమ పేరుతో అదనంగా మరో కిలో కోత పెడుతుండడంతో రైతులు క్వింటాకు సగటున రూ. 200 వరకు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏ గ్రేడ్ వడ్ల ధర క్వింటాకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300గా ఉంది. వరి కోతలు మొదలై రెండు వారాలు గడుస్తున్నా అధిక శాతం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు మొదలు కాకపోవడంతో వడ్లు తీసుకొచ్చేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి వసతులు లేకపోవడం, టార్పాలిన్ల కొరతతో వర్షం వస్తే ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఉంది. దీంతో చేతికి వచ్చిన పంట నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళనతో రైతులు రైస్ మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీడ కోసం టెంట్లు వేయకపోవడంతో వారికి చెట్ల నీడే దికవుతున్నది. తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రైతులు ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. టార్పాలిన్లు, గన్నీ సంచు లు అందుబాటులో లేవు. తరుగు పేరుతో బస్తాకు నాలుగు కిలోల ధాన్యం తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజులు దాటినా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కేంద్రాల్లోనే ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నదని, ఇప్పటికైనా కొనుగోళ్ల్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 174 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. జిల్లాలోని తాళ్లపూసపల్లి, ఈదులపూసపల్లి, నెల్లికుదురు తదితర కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి మరీ దైన్యంగా ఉంది.
ఖిలావరంగల్ : ప్రజా పాలన అంటూ గొప్ప లు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెడుతూ రైతులను గోస పెడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతలను నిబంధనల పేరుతో ఆగం చేస్తున్నది. ఖిలావరంగల్ మండలంలో బొల్లికుంట, వసంతాపురం, తిమ్మాపురం గ్రామాల్లో ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సారి వసంతాపురంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇక తిమ్మాపురంలో ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క బస్తా కూడా తరలించలేదు. బొల్లికుంటలో మాత్రం అధికారికంగా ఒకటి, అనధికారికంగా మరొక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇందులో అనధికారిక కేంద్రంలోనే క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో కొత్త నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయి. ఒక రైతు గరిష్ఠంగా ఎకరానికి 32 క్వింటాళ్ల చొప్పున తీసుకురావాలని, అదికూడా రూ.3 లక్షల కంటే ఎక్కువ విలువ చేసే ధాన్యం తేవొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పది, ఇరవై ఎకరాల్లో సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. గన్నీ బ్యాగ్‌ల పంపిణీ, టోకెన్ ఇవ్వడం, ఆన్లైన్లో నమోదు చేయడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
దీనికి తోడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ఆన్లైన్లో పంటలు నమోదు చేశారు. దీంతో ఆన్లైన్లో నమోదైన పంటకు, కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యానికి పొంతన లేకపోవడంతో తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు అధికారులు రైతులను గోసపెడుతున్నారు. అలాగే ధాన్యాన్ని దగ్గరలోని మిల్లులకు కాకుండా దూర ప్రాంతాలకు తరలిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు బొల్లికుంట కొనుగోలు కేంద్రం నుంచి 2500 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించి 20 రోజులు దాటినా తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదని రైతులు తెలిపారు.
వడ్ల కొనుగోలులో కీలకమైన గన్నీ సంచులు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు చేరలేదు. వారం క్రితం అన్ని గ్రామాల్లోనూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గన్నీ సంచులు లేకపోవడంతో కాంటాలు మొదలు కావడంలేదు. రైతులు వెళ్లి సంచులు కావాలని అడిగితే వరుస ప్రకారం ఇస్తామని, కోటా ప్రకారం వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులకు ఇంకా టోకెన్ బుక్కులు అందలేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటి నుంచి కాంటాలు అవుతాయో స్పష్టత లేకపోవడంతో రైతులు కల్లాల వద్దనే తక్కువ ధరకు మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు.
ఏటా మూడెకరాల్లో రెండు పంటలు వరి పంట సాగుచేస్తున్న. ఈ సారి 74 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. అధికారులు ఆన్లైన్లో 1.8 ఎకరాల్లో పంట వేసినట్లు నమోదు చేసిండ్లు. వడ్లను మిల్లుకు పంపి 20 రోజులైనా బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడలేదు. మూడు రోజుల నుంచి అధికారులకు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
– మెట్టు రాజిరెడ్డి, బొల్లికుంట
ఏడు ఎకరాల్లో వరి పంట వేసిన. వంద క్వింటాళ్లు దొడ్డు వడ్లు, 60 క్వింటాళ్లు సన్న వడ్లు పండినయి. అయితే అధికారులు నేను నాలుగు ఎకరాల్లో వరి వేసినట్లు నమోదు చేసిండ్రు. మూడెకరాల కంటే ఎక్కువ పంట తీసుకు రావద్దు.. రూ. 3 లక్షలపైన విలువ చేసే ధాన్యం తేవొద్దంటూ కండీషన్లు పెడుతున్నరు. ఆఫీసుల కూర్చొని ఆన్లైన్లో తప్పుగా నమోదు చేసి రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.
– చక్రపాణి, బొల్లికుంట