నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 25 : రైతులకు అండగా బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. యూరి యా కొరతపై సోమవారం రైతులతో కలిసి ఎక్కడికక్కడే ధర్నాలు చేసింది. వ్యవసాయ కార్యాలయాలు, సొసైటీల ఎదుట ఆందోళనలు చేపట్టింది. అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, రేవంత్ సర్కారు తీరును ఎండగట్టింది.
వరంగల్ జిల్లా నెక్కొండలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కురవిలో మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయ క్, గార్లలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు పాల్గొని రైతులకు మద్దతు పలికారు. అదేవిధంగా నల్లబెల్లి, దుగ్గొండి, బయ్యారం తదితర చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ఆందోళ నలు నిర్వహించారు. నల్లబెల్లిలో తహసీల్దార్, ఏవోను నిలదీశారు. పలు చోట్ల వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.