కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాలు పెడుతున్నది. యాసంగిలో సాగు నీళ్లు ఇవ్వక అరిగోస పెట్టింది. కళ్ల ముందే వరి పంట ఎండిపోతుంటే.. నరకయాతన పడి రక్షించుకొని.. అనేక తంటాల నడుమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత.. రెండు నెలలుగా క్వింటాకు రూ. 500 చొప్పున సన్న వడ్ల బోనస్ రాక ఇబ్బందులు పడుతున్నాడు. వానకాలం రావడంతో పెట్టుబడి డబ్బులు లేక రైతులు అప్పు కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుండగా.. రాష్ట్ర సర్కారు మాత్రం యాసంగి పంటకూ ఇస్తామన్న బోసన్ చెల్లించక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.
– వరంగల్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అన్నదాతలను కాంగ్రెస్ సర్కారు ఆగం చేస్తున్నది. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వానకాలం సాగు సీజన్ మొదలవుతున్నా ఇప్పటికీ యాసంగి వడ్లను పూర్తిగా కొనుగోలు చేయలేదు. సన్న వడ్లకు యాసంగిలోనూ క్వింటాకు రూ. 500 బోసన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్న ఒక్క రైతుకూ చెల్లించలేదు. వానకాలం ప్రారంభం కావడంతో పంటల సాగుకు రైతులకు పెట్టుబడి అవసరం ఉన్నది. ఈ పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగిలో 6.60 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2.47 లక్షల టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసింది. ఈ వడ్లకు సంబంధించిన రూ. 123 కోట్ల బోనస్ మొత్తం రైతులకు చెల్లించాల్సి ఉన్నది.
నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో పంటల సాగు ఈసారి త్వరగా మొదలవుతున్నది. పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సి వస్తున్నది. దొడ్డు వడ్ల కంటే సన్న వడ్లు పండించడం కష్టమైన పని. సన్నాల పంట కాలం ఎక్కువగా ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల రూపంలో ఈ పంట సాగుకు పెట్టుబడి అధికంగా అవుతుంది. దొడ్డు వడ్ల కంటే సన్న వడ్ల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. రైతులు కష్టపడి పండించిన సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1130 కొనుగోలు కేంద్రాల్లో 9.73 లక్షల వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటి వరకు 6.15 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయగా, ఇందులో 2.47 లక్షల టన్నుల సన్న వడ్లున్నాయి. వీటికి సంబంధించి బోనస్ డబ్బులు తమ ఖాతాల్లో ఇంకా జమకాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వడ్ల కొనుగోలును పూర్తి చేయలేదు. అనేక ఊర్లలో ఇప్పటికీ ధాన్యం కాంటాలు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ఉడడంతో వర్షాలకు తడిసి మొలకెత్తుతున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంట చెడిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.