‘చెరువులు, కుంటలు ఎండిపోయినయ్.. వాగులు, చెక్ డ్యాముల్లో చుక్క నీరు లేదు. భూగర్భ జలాలు పడిపోయినయ్.. బావులు అడుగంటినయ్.. బోర్లు పోస్తలేవు.. రెండు తడులు పారితే చేతికొచ్చే పంట సాగు నీరు లేక కళ్లముందే తెర్లవుతున్నది. ఎస్సారెస్పీ, దేవాదుల కాల్వలల్ల నీళ్లొస్తయన్న ఆశతోటి యాసంగిలో వరి, మక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసినం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కరువును తీసుకొచ్చింది. నీళ్లున్నా పంటలకు వదలక మమ్ములను అరిగోస పెడుతున్నది’ అంటూ రైతులు రాష్ట్ర సర్కారుపై మండిపడుతున్నారు. ఎండిపోతున్న పంటలు కాపాడుకునేందుకు తండ్లాడుతున్నరు.
వాగుల్లో జేసీబీలతో చెలిమలు తోడడం, బావుల్లో పూడిక తీయడం చేస్తున్నారు. అయితే ఇన్ని పాట్లు పడి నీరు పారిద్దామంటే విద్యుత్ కష్టాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయని, ఒక్క మడి పారకముందే కరెంట్ పోతున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగం పంట పోతే పశువుల మేతకు వదిలిపెట్టామని, మరో పదిరోజులు ఇదే పరిస్థితి ఉంటే మొత్తం ఎండుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కష్టపడినప్పటికీ చివరికి పంట చేతికొస్తుందో.. లేదోనని, పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందో.. రాదోనని ఆందోళన చెందుతున్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క గుంట కూడా పంట ఎండలేదని గుర్తుచేసుకుంటున్నరు. అప్పుడు కాంగ్రెస్ మాటలకు ఆశపడి.. ఇప్పుడు గోసపడుతున్నామని బోరుమంటున్నారు.
-నమస్తే నెట్వర్క్, మార్చి 12
మల్హర్ : గత 15 ఏళ్లుగా మానేరు పరీవాహక ప్రాంతంలో ఐదెకరాల పొలం సాగు చేస్తున్న. గత పదేళ్ల నుంచి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర నుంచి పంటలకు నీటి తిప్పలు తప్పడం లేదు. గతంలో మానేరు పక్కన 40 ఫీట్ల ఫిల్టర్ వేస్తే నా పొలానికి పుష్కలంగా నీరందేది. ఇప్పుడు దానిలో నీరు లేక పక్కనే రూ. లక్ష ఖర్చు చేసి 100 ఫీట్ల లోతుతో మరో ఫిల్టర్ వేస్తున్న. అయినా నీరు పడుతుందో.. లేదో.. అని ఆందోళనగా ఉంది. చెరువులు, కాల్వలు, వాగులు ఎండిపోయి పంటలు సాగు చేసే పరిస్థితి పోయింది. మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లినట్టు తయారైంది. రైతులకు మళ్లీ కన్నీరే మిగిలింది. మా కోసం కాదు.. పంటల కోసం నీరివ్వాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
– మాచర్ల మధు, రైతు, తాడిచర్ల
దేవరుప్పుల : పదేండ్లు కేసీఆర్ సారు చేసిండు గదా.. రేవంత్‌రెడ్డి బా గా మాట్లాడుతుండని ఒక్కసారి ఓటేసి చూద్దామనుకున్నం. ఇంత గందరగోళం అయితదనుకోలే. రైతుల ఎంబ డే పడ్డడు. రుణ మాఫీ లేదు. రైతు భరోసా పడుతలేదు. 3 ఎకరాలు నాటు పెడితే బోర్లు పోయక మొత్తం ఎండిపోయింది. ఏది చూసినా కరువే. ఇన్ని నీళ్లొదులుతె రైతులు బాగుపడుతరుకదా. దయాకర్‌రావు ఉంటే ఇట్ల చెప్పితే అట్ల నీళ్లు వచ్చేది. ఒద్దంటే కాల్వలు పారేది. ఇంత కరువు పదేండ్లలో ఎన్నడు చూడలే. అడిగేటోడు లేడు. తుంట దించి మొద్దు ఎత్తుకున్నట్లు ఉంది మా పరిస్థితి.
-గుగులోత్ తేజ్యా, రైతు, పెద్దతండా
బచ్చన్నపేట : మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల పరిధి మొండికుంట. మాకున్న 11 ఎకరాల్లో వరి పంట సాగు చేసినం. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోస్తలేవు. దీంతో నీరందక పంటంతా ఎండిపోయింది. సాగు కోసం రూ. 2.50 లక్షల పెట్టుబడి పెట్టిన. పంటను కాపాడుకునేందుకు రూ. 4.50 లక్షలు అప్పులు తెచ్చి ఏడు బోర్లు ఏసినం.
ఒక్కదాంట్లో కూడా నీరు పడకపోవడంతో పంటంతా పశువులకు మేతగా మారింది. గత సీజన్లో చేతికొచ్చే సమయంలో వడగళ్లు పడడంతో పంటంతా నేలపాలైంది. ఒక్క ఎకరానికి కూడా పరిహారం రాలేదు. గత ప్రభుత్వం తొమ్మిదేళ్లు సమృద్ధిగా సాగునీరివ్వడంతో పంటలు బాగా పండించినం. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపితే మాకు ఇబ్బంది కలిగేది కాదు. కళ్ల ముందే ఇన్ని ఎకరాల పంట ఎండిపోతుంటే ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం నీళ్లు విడుదల చేసి పంటలు కాపాడాలే.
– మల్గ లక్ష్మి, మహిళా రైతు, మొండికుంట, బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు చల్ల మల్లారెడ్డి. ఏటా యాసంగిలో ఐదెకరాల్లో వరి పంట సాగుచేసేవాడు. ఈసారి పరిస్థితిని ముందే గమనించి మూడు ఎకరాల్లోనే వరి నాటు వేశాడు. తనకు బావితోపాటు బోరు అడుగంటడంతో పంటకు సరిపడా నీరందడం లేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు రెండు రోజులకోసారి రూ. 500 చెల్లిస్తూ ఆరు ట్యాంకర్ల నీటిని వరి పంటకు అందిస్తున్నాడు.
– లింగాలఘనపురం, మార్చి 12
మరిపెడ : వ్యవసాయ పెట్టుబడి కోసం బంగారంను బ్యాంక్ లో పెట్టి రూ. 3 లక్షలు తీసుకున్న. మరో రూ. 2లక్షలు అప్పు తీసుకొచ్చి నాకు న్న 3 ఎకరాలకు తోడు 24 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగుచేసిన. 7 బావులు, 2 బోర్లు, ఆకేరు వాగులో మూడు మోటర్ల సాయంతో సాగునీరందిస్తున్న. రోజు రోజుకు ఎండలు తీవ్రం కావడంలో భూగర్భ జలాలు అడుగంటాయి.
బావిలో నీరు ఇంకిపోవడంతో పూడికతీసినా ఫలితం లేకపోవడంతో 12 ఎకరాల వరి పంటను పశువుల మేతకు వదిలిపెట్టిన. వానకాలంలో ఆకేరు వాగులో వచ్చిన వరదలతో పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాం. వాగులో చెక్ డ్యాంలన్నీ తెగిపోవడంతో నీళ్లు నిల్వ లేకుండా పోవడం, యాసంగి పంటకు నీరందక పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్ధితి వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆకేరువాగులోకి ఎస్సారెస్పీ జలాలు వదిలి పంటలను కాపాడాలి.
– మూడ శ్రీను, కౌలు రైతు, సీతారాంతండా, మరిపెడ మండలం
చిల్పూరు : మాది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఫతేపూర్ గ్రామ శివారులోని బొండబడ్డ తండా. నాకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంట సాగుచేస్తే మొత్తం ఎండిపోతున్నది. మాకు కూతవేటు దూరంలో మల్లన్నగండి రిజర్వాయర్ ఉన్నా కనీసం చెరువులకు నీరు వదలడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ చెరువులు ఎండలేదు. కంటి రెప్ప కొట్టినంత సేపు కరెంట్ పోలేదు. సాగు నీరిచ్చి పంటలు కాపాడాలని ఎమ్మెల్యేను అడిగితే వచ్చే వానకాలం వరకు ఇస్తానన్నడు.
– బానోత్ శశిరామ్, రైతు, బొండబడ్డ తండా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం