IndiGo flight : ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతోపాటు పలు గల్ఫ్ దేశాలు (Gulf countries) తమమత గగన తలాలను మూసివేశాయి. దాంతో మరో మార్గంలో వెళ్లేందుకు ఢిల్లీ (Delhi) నుంచి మాంచెస్టర్ (Manchester) బయల్దేరిన ఇండిగో విమానం (IndiGo flight) యూటర్న్ తీసుకుంది.
ఇథియోపియా (Ethiopia) సరిహద్దులోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆ దేశం కూడా గగనతల ఆంక్షలు విధించడంతో అప్పటికే ఏడు గంటలపాటు ప్రయాణించిన విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి మాంచెస్టర్ బయల్దేరింది.
పశ్చిమాసియాలో పలు దేశాల గగనతలాలు మూసి ఉండడంతో.. మరోమార్గంలో గల్ఫ్ ఆఫ్ అడెన్, ఆఫ్రికా మీదుగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఇథియోపియా సరిహద్దుకు చేరుకుంది. మరో నాలుగు గంటల్లో మాంచెస్టర్ చేరుకోవాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఇథియోపియా ప్రభుత్వం గగనతల ఆంక్షలు విధించింది. దాంతో విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అయితే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఇండిగో తెలిపింది.