Maharashtra : మూడు చక్రాల ఆటోరిక్షాలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆటోరిక్షాలకు అనుమతుల మంజూరును నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. తాజా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దీనిపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో మూడు చక్రాల ఆటోరిక్షాలు సంతృప్త (గరిష్ట) స్థాయికి చేరుకున్నాయని, అందువల్ల నగరాల్లోని రోడ్ల సామర్ధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటోలకు అనుమతుల మంజూరును నిలిపివేశామని ప్రభుత్వం తెలిపింది.
2025-26 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం మహారాష్ట్రలో 1.3 మిలియన్లు (12.96 లక్షలు) రిజిష్టర్డ్ త్రీ వీలర్ ఆటోలున్నాయి. ముంబై మెట్రో నగరంలోనూ అధికంగా ఆటోలున్నాయి. గరిష్ట స్థాయిని మించిపోయాయి. ముంబైలో సగటున ఒక కిలోమీటర్‌కు 2,648 ఆటోలు రోడ్లపై తిరుగుతున్నట్లు ఆర్టీవో డాటా తేల్చింది. ఇది ఇండియాలోని అన్ని మెట్రో నగరాలకంటే అత్యధికం. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 2.5 లక్షల ఆటోలు ఉన్నాయి. దీంతో నగరంలో ‘లేన్ టు వెహికల్’ స్థాయి మించిపోయింది. పార్కింగ్‌కు కూడా సమస్యలొస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. పర్యవరణానికి కూడా హాని కలుగుతోంది. ఇప్పటికే ముంబైలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ప్రస్తుతం ఏక్యూఐ 170-200 వరకు ఉంది. ఇది అనారోగ్య స్థాయి. సగటున 50-100 వరకు ఉండాలి. సీఎన్జీ ఆటోలతో కూడా ఎక్కువ వాయు కాలుష్యం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే కాలుష్యాన్ని తగ్గించేందుకు ముంబై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రో కారిడార్ పెంపు, ఎలక్ట్రిక్ బస్సులవైపు దృష్టిసారించింది. అలాగే కొత్త ఆటోలకు అనుమతి నిరాకరించింది. ఈ చర్యల వల్ల ట్రాఫిక్ తగ్గడం, కాలుష్యం తగ్గడంతోపాటు ఆటో రిక్షా నడిపే వారి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఆటోలకు సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించే వీలుంటుంది. కొత్త ఆటోలు రాకపోవడంతో ఇప్పుడున్న వాటి ద్వారా డ్రైవర్లకు మెరుగైన ఆదాయం లభిస్తుంది.