చి‘వరి’ తడికి నీరందించేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికల్లా అ ప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నోటికందే సమయానికి పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎలాగైనా పంటలను కాపాడుకోవాలని బోర్ల పక్కన బోర్లు వేస్తూ, వాగులు, కుంటల్లో పూడిక తీస్తూ సాగు నీటి కోసం తండ్లాడుతున్నారు. కొందరు రైతులు రూ. వేలు ఖర్చు చేసి జేసీబీతో వాగుల్లో గుంతలు తవ్వించి, మోటర్లు పెట్టి కొద్దోగొప్పో నీటిని తమ పొలాలకు పారిస్తున్నారు.
యాసంగికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వలతో వాగులు, చెరు వులు, కుంటలు నింపకపోవడంతో భూగర్భ జలాలు తగ్గి బావులు, బోర్లలో నీరు అడుగంటి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. బావులు, బోర్లలో నీళ్లు ఎల్లక పంటలు ఎండిపోవడంతో కొందరు రైతులు పశువుల మేతకు వదిలేశారు. మరికొందరు చివరి తడి నీటి కోసం ఆశగా ఎదురు చూస్తు న్నారు. ముందస్తుగా ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయకనే తమ పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు దుమ్మెత్తి పోస్తున్నారు. – నమస్తే నెట్వర్క్, మార్చి 13
సంగెం : నీళ్లులేక పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏంచేస్తున్నరు? మా కష్టం, శ్రమ చూడండి. దేవాదుల కాల్వల ద్వారా నీళ్లస్తయని పంటలు వేసినం. అవి రాక పంటలు ఎండిపోయినయ్. మా ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలే. రైతులను ఎవరు పట్టించుకుంటరు. కొత్త ప్రభుత్వం కాల్వలు శుభ్రం చేసి నీళ్లిస్తది కావచ్చు అనుకున్నం. ఎమ్మెల్యేలు, అధికారులకు పట్టింపు లేదా? కొద్దిగనైనా చర్యలు తీసుకోరా? కెనాల్లో మొలిచిన చెట్లను తొలగించెటోళ్లు లేరు. సాగునీరు లేక నా మక్కజొన్న పంట ఎండిపోతున్నది.
– సింగిరెడ్డి బుచ్చిరెడ్డి, రైతు, గవిచర్ల, సంగెం మండలం