అడవి చిగురించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వనసంకల్పం సాక్షాత్కరించింది. నాటి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాల పట్టింపులేమితో అటవీ ప్రాంతం క్రమంగా అంతరిస్తూ, కనుమరుగై పోయే స్థితికి చేరింది. దట్టమైన అటవీ ప్రాంతంగా పేరొందిన జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, రాయికల్, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్, ధర్మపురి ప్రాంత అడువులు పూర్తిగా మైదాన ప్రాంతాలుగా మారిపోగా, బీఆర్ఎస్ పాలనలో అటవీ శాఖ చేపట్టిన చర్యలతో జీవం పోసుకున్నది. 2016-17 వరకు డొల్లగా మారిపోయిన జంగల్, మళ్లీ పచ్చబడి, జీవజాలం మళ్లీ పురుడుపోసుకోవడం ఆరంభమైంది. గత నెల 19 నుంచి 28వ తేదీదాకా అటవీశాఖ చేపట్టిన జంతు గణనతో జిల్లాలో 8 చిరుతలు, 108 ఎలుగుబంట్లు ఉన్నట్లు తేలింది. కొత్తగా అడవి కుక్కలు, ముళ్లపంది, అడవి కోళ్ల సంతతిని గుర్తించగా, పర్యావరణ ప్రేమికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాల పట్టింపులేని తనం, ప్రజల్లో పర్యావరణ దృష్టి లేకపోవడం వల్ల అడవులు క్రమంగా తగ్గిపోయాయి. దశాబ్దాల కాలంలో అంతరించే పోయే స్థితికి చేరాయి. ఇలానే జగిత్యాల జిల్లాలోనూ కనుమరుగయ్యాయి. ఒకప్పుడు మనిషి కాదు కదా పక్షులు సైతం దూరలేనంత దట్టంగా సారంగాపూర్, రాయికల్, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్, ధర్మపురి ప్రాంత అడవులు పూర్తిగా మైదాన ప్రాంతాలుగా మారిపోయాయి.
అడవి చిక్కిపోయి జీవరాశి, పశుపక్ష్యాదులు క్రమంగా తమ ఉనికిని కోల్పోయాయి. వాతావరణం పూర్తిగా మారిపోయింది. విపరీత వేసవితాపాలు, కానరాని వర్షారుతువులతో పర్యావరణం లోపించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాలూ కూడా పట్టించుకోలేదు. ప్రమాదకర స్థాయిలో అడవులు తగ్గినా పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ, స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అడవులకు తిరిగి జీవం పోసే లక్ష్యంతో ముందుకెళ్లింది. అందుకు అనుగుణంగా పలుచబడిన అడవులను పునరుద్ధించేందుకు చర్యలు ప్రారంభించింది.
పర్యవేక్షణ పెంచడం, చిన్నబీట్లను ఏర్పాటు చేయడం, అటవీశాఖ సిబ్బందికి బైకులు ఇవ్వడం, తనిఖీలు పెంచడం, కలపదొంగలపై కఠినంగా వ్యవహరించడం లాంటివి చేసింది. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా అటవీ శాఖ రంగంలోకి దిగింది. కొత్తగా చెట్లను నాటడంతో పాటు పలుచబడిన ఏరియాలో పలు పద్ధతుల్లో ప్లాంటేషన్ చేపట్టి సఫలీకృతమైంది. అడవి మళ్లీ పచ్చబడి, జీవజాలం మళ్లీ పురుడుపోసుకోవడం ఆరంభమైంది. 2016-17 వరకు డొల్లగా మారిపోయిన అటవీ ప్రాంతం, ఈ దశాబ్దకాలంలో మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. గత నెలలో అటవీశాఖ చేపట్టిన అడవి జంతువుల గణనతో ఈ విషయం తేలింది.
జగిత్యాల జిల్లాలోని అడవుల్లో 2020లో అటవీశాఖ జంతు గణన చేపట్టగా, కొన్ని జంతువుల సంఖ్య మాత్రమే నమోదైంది. రెండు చిరుత పులులు, కొన్ని నక్కలు, రెండు మూడు ఎలుగుబంట్లు మాత్రమే ఉన్నట్టు గుర్తించింది. అయితే ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ధర్మపురి, జగిత్యాల, కొడిమ్యాల, మెట్పల్లి, రాయికల్ రేంజ్‌ల పరిధిలో 8 చిరుతలు ఉన్నట్టు గుర్తించారు.
అలాగే గతేడాది ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం నుంచి కె.12 అనే పెద్దపుల్లి కొడిమ్యాల రేంజ్‌కు వచ్చి, ఇక్కడి అటవీ ప్రాంతంలో మూడునెలలు నివసించిందని గుర్తించారు. మూడు నాలుగు నెలలపాటు ఇక్కడ ఉందంటే నీటి సౌకర్యంతో పాటు రక్షణ, దానికి ఆహారం లభ్యమయ్యే పరిస్థితికి చేరుకున్నట్టేనని చెబుతున్నారు. అలాగే 803 అడవి పిల్లులు, 103 ఎలుగుబంట్లు, 1103కు పైగా నక్కలు, 220 వరకు అడవి కుక్కలు, 65 వరకు అడవి గండుపిల్లులు ఉన్నట్టు గుర్తించారు. ఎలుగుబంట్ల సంఖ్య వందకు పైగా పెరిగిందంటున్నారు. గతంలో జగిత్యాల జంగల్లో అడవి కుక్క మనుగడ లేదని, అయితే ఇప్పుడు ఏకంగా 220కి పైగా కనిపించాయంటున్నారు.
ఇక శాఖాహార జీవులైన కొండెంగలు, చుక్కల జింకలు, అడవిపందులు, నీల్గాయ్లు, నెమళ్లు, కొండగొర్రెలు, వందల సంఖ్యలోనే వృద్ధి చెందాయి. గతంలో కొండగొర్రెలు, ముండ్ల పందులు, రెడ్జంగిల్ ఫ్లో, గ్రే జంగిల్ఫ్లో (అడవి కోళ్లు) ఈ ప్రాంతంలో లేవని, ఈ సారి వాటి సంఖ్య గణనీయ స్థాయిలో కనిపించిందని అధికారులు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మొత్తంగా జిల్లా అడవుల్లో మాంసాహార, శాఖాహార జీవులు కలిపి మొత్తం 27,733 ఉన్నాయని లెక్కగట్టారు. చిరుతలు, ఎలుగుబంట్ల వృద్ధితోపాటు కొండగొర్రె, అడవికోళ్లు, ముళ్లపందుల ఉనికి, ఉత్పత్తి జిల్లా పరిధిలో మళ్లీ ప్రారంభమైనట్లు ఉన్నతాధికారులకు నివేదించారు.
అటవీ సంపద వృద్ధి, అడవిని చికబరిచేందుకు అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ ఏరియాలో 38 చెక్ డ్యామ్‌లను నిర్మించారు. వంద కుంటలను తవ్వించారు. గుట్టలు ఉన్న ప్రాంతాల్లో నీటి ధారల ఆధారంగా ట్రెంచ్‌లను రూపొందించారు. 788 రాతికట్టడాలను అడవుల్లో ఏర్పాటు చేశారు. అడవుల్లో నీటి ధారల ఆధారంగా 3,29,265 మీటర్ల పొడవున సమతల కందకాలు తవ్వించారు.
ఒక అటవీ ప్రాంతంలోనే 19.60లక్షల మొకలు నాటి పెంచుతున్నారు. అటవీ సంపద రక్షణ కోసం 17 కిలోమీటర్ల పొడవునా కందకాలు తవ్వించారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం 671 కిలోమీటర్ల పొడవున ఫైర్ లైన్లు, రెండు వాచ్ టవర్లను అమర్చారు. వీటితో పాటు, వృక్షాలను నరికివేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగా, అటవీ సంపద తిరిగి గాడిన పడింది. 8377 ఎకరాల్లో తిరిగి పునరుద్ధరించబడింది. 2,955 ఎకరాల్లో అటవీ అధికారులు ప్లాంటేషన్లను విజయవంతంగా ఏర్పాటు చేయగా, వనం చిగురించి జీవరాశులు సైతం క్రమంగా వృద్ధి చెందుతున్నాయి.
పూర్వకాలంలో మనిషి పర్యావరణాన్ని కాపాడాడు. కానీ కొన్నిదశాబ్దాలుగా పర్యావరణంపై అవగాహన కరువైంది. దీంతో అటవీ సంపద హననం జరిగింది. జీవజాలం సమస్యల్లోకి కూరుకుపోయింది. అటవీ సంపదను కాపాడడం, 33 శాతం మేర పెంచేందుకు అనేక రకాల ప్రక్రియలు అమలు చేస్తున్నాం. కొంత విజయవంతమయ్యాం. జగిత్యాల అడవి మళ్లీ చిగురిస్తున్నది. జీవజాలం వృద్ధి చెందుతున్నది. జగిత్యాల అడవుల్లో ఇంతకు ముందు అంతరించిపోయిన కొండగొర్రె, ముల్లపంది, అడవికోళ్లు, అడవికుక్కల జాతులు తిరిగి తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి.
జిల్లాలో దశాబ్దకాలంలో చేసిన కృషి ఫలితంగా దట్టమైన జంగల్‌గా రూపాంతరం చెందింది. ఒకప్పుడు 8వేల హెక్టార్లలో అతి పలుచగా ఉన్న ఫారెస్ట్, నేడు మధ్యస్థ అడవిస్థాయికి పెరిగిపోయింది. కొన్నేళ్లలోనే 15 నుంచి 20వేల హెక్టార్లలో దట్టమైన అడవి వృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉన్నది. అయితే మనిషికి పర్యావరణం, అడవి సంపద, జీవకోటి మనుగడపై అవగాహన రావాలి. అప్పుడే ప్రకృతి బాగుంటుంది. జీవకోటి చల్లగుంటుంది.
– మాదాసు రవి ప్రసాద్, జిల్లా అటవీశాఖ అధికారి (జగిత్యాల)
జిల్లాలో అటవీ సంపదను జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్‌లుగా వర్గీకరించారు. వీటి పరిధిలో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. కాలగమనంలో అది తగ్గిపోగా, అటవీ చికదనాన్ని పెంచేందుకు అధికారులు పలు పద్ధతుల్లో ప్రయత్నాలు ఆరంభించారు.
1. బ్లాక్ ప్లాంటేషన్ : అడవి నశించినచోట వ్యవసాయం కోసం ఎలాగైతే దుకులు దున్ని వరినాట్లు వేస్తారో..? అదే తరహాలో పెద్ద సంఖ్యలో మొకలు నాటి జీవం పోశారు.
2. గ్యాప్ ప్లాంటేషన్ : అటవీ ప్రాంతంలో మైదానంలా మారిన చోట్ల ట్రాక్టర్లతో దున్ని మొక్కలు నాటి పెంచే ప్రక్రియను చేపట్టారు. చెట్లు పలుచగా ఉన్నట్టయితే అక్కడ గ్యాప్ ప్లాంటేషన్ పద్ధతిని పాటిస్తూ వృద్ధి చేసే ప్రక్రియను చేపట్టారు. అడవిలో ఎక్కడైతే చెట్లు పోయాయో..? అక్కడ గుంతలు తీసి మొక్కలు నాటారు. అడవిని తిరిగి ఫుల్‌ఫిల్ చేసే పనికి శ్రీకారం చుట్టారు.
3. బాంబింగ్ ప్లాంటేషన్ : అడవిలో చాలా చోట్ల నాలాలు ఉన్నాయి. వీటికి ఇరువైపులా ఇసుక మేటలు వేసే అవకాశం ఉండగా, వాటిల్లో పచ్చదనాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నాలాల చుట్టూ ఉండే ఇసుక మేటల్లో బాంబింగ్ పద్ధతిలో వెదురు వనాలను వృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టారు.
4. మౌండ్ ప్లాంటింగ్ : అడవుల్లో ఈజీఎస్ కూలీలతో నిర్మించిన ట్రెంచ్ల్లోనూ మొక్కలు పెంచే పద్ధతి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం చిన్నచిన్న ట్రెంచ్‌లను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రెంచ్‌లు తవ్వి పక్కనే పోసిన మట్టిలో ఐదేసి ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ట్రెంచ్ల్లో నీటిని తట్టుకొని బతికి పెరిగే రకానికి చెందిన తెల్లమద్ది లాంటి ఔషధ చెట్ల పెంపకం చేపడుతున్నారు.
5. బోడిగుట్టల వనీకరణ : కొండల వాలుపైన సైతం వృక్షాలను పెంచే ప్రక్రియను బోడిగుట్టల వనీకరణగా పేర్కొంటున్నారు. కొండ వాలులో ట్రెంచ్‌లను (కందకం లాంటిది) తవ్వి, వాటికి ఎగువ, దిగువ భాగాల్లో అడవులను పెంచుతున్నారు. రాయికల్ లాంటి దట్టమైన టేకు వనాలతో కూడిన అటవీ ప్రాంతంలో కల్చరల్ ఆపరేషన్స్‌ను నిర్వహించి, టేకు మొక్కలు పెంచుతున్నారు. టేకు చెట్లు ఎక్కువ సూర్యరశ్మిని ఆశించేవి కావడంతో అవి చాలా పొడుగ్గా పెరుగుతాయి. పక్కపక్కనే ఉన్న రెండు టేకు చెట్లు ఎదిగే క్రమంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో ఎక్కువ కొమ్మలు ఉన్న వాటిని తొలగించి, చెట్లను పొడవుగా, ఏపుగా పెంచి అడవిని చిక్కబరిచే ప్రక్రియ చేపడుతున్నారు.
6. గచ్చకాయ ప్లాంటేషన్ : అటవీశాఖ చేపట్టిన చర్యల్లో అన్నింటికంటే ముఖ్యమైనది ఈ ప్లాంటేషన్. అటవీ ప్రాంతం రక్షణ కోసం ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. అడవిచుట్టూ కందకాలు తీసి, వాటి ముందు భాగంలో గచ్చకాయ మొక్కలు నాటుతున్నారు. వీటికి త్వరగా పెరిగే గుణం ఉంటుండడంతో అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి. ఈ చెట్లకు ఉన్న ముండ్లు అడవికి రక్షణగా మారుతున్నాయి. మనుషులు కాదు కదా, కనీసం జంతువులు, పాములు, కోళ్లు సైతం ఈ చెట్లను దాటుకొని అటవీభూముల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదు.