Nandus World | ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘నందూస్ వరల్డ్’ ద్వారా నెటిజన్లకు సుపరిచితురాలైన రమా నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి చుట్టూ వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. యూకే వీసాల రెన్యూవల్, బ్రిటన్ జాబ్ స్పాన్సర్‌షిప్‌ల పేరుతో వీరు కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారంటూ వీరిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రమా నందన, మధుకర్, మరియు మధుకర్ తండ్రిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. వీరు నడుపుతున్న ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ ద్వారా వీసా రెన్యూవల్స్, బ్రిటన్ ఉద్యోగాల పేరిట పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, సదరు దంపతులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను రమా నందన ఒక వీడియో వేదికగా తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో తమకున్న క్రేజ్ చూసి ఓర్వలేక, వ్యక్తిగత కక్షలతో కొందరు కావాలనే డబ్బులు ఇచ్చి తమపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె వివరణ ఇచ్చారు. తమకు ఎలాంటి మోసాలతో సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ, ప్రస్తుతం ఈ వీసా స్కామ్ వివాదం తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది. యూట్యూబర్ రమా నందన మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించింది.