Trichy East By Poll | తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం తిరుచ్చి ఈస్ట్ (Tiruchirappalli East) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేయబోయే టీవీకే అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదట్లో విజయ్ సరసన పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి త్రిష కృష్ణన్ ఇక్కడి నుండి పోటీ చేస్తారని, ఆమె ఈ స్థానం ద్వారానే రాజకీయ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే తాజా పొలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రేసులోకి ప్రముఖ నటుడు, దర్శకుడు, సామాజిక సేవాకర్త రాఘవ లారెన్స్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. లారెన్స్ స్వయంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరబోతున్నారని, ఆయనే తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక బరిలో నిలుస్తారనే వార్తలు తమిళనాట జోరందుకున్నాయి.
మరోవైపు ఇటీవల తిరుచ్చిలో జరిగిన ధన్యవాదాల సభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ ఈ ఉపఎన్నిక అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుచ్చి నియోజకవర్గం తన హృదయానికి ఎంతో దగ్గరైనదని, అందుకే ఈ ఉపఎన్నికలో తాము ఒక స్థానిక అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్కడి ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక నాయకుడిని బరిలోకి దించుతామని ఆయన హింట్ ఇచ్చారు. సీఎం విజయ్ చేసిన ఈ ప్రకటనతో హైప్రొఫైల్ సినీ సెలబ్రిటీలైన త్రిష లేదా రాఘవ లారెన్స్లకు టికెట్ దక్కుతుందా, లేక విజయ్ చెప్పినట్లు స్థానిక టీవీకే నాయకుడికే అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాఘవ లారెన్స్ ఎంట్రీ మరియు టీవీకే పార్టీ రాజకీయ సమీకరణాలపై వస్తున్న వార్తలపై పూర్తి క్లారిటీ రావాలంటే పార్టీ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.