హైదరాబాద్ : బీహార్ ప్రభుత్వం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలకు కల్పిస్తున్న అత్యున్నత స్థాయి జెడ్-ప్లస్ (Z-Plus) భద్రతను ఉపసంహరించుకుంది. వీఐపీ భద్రతపై జరిపిన సమీక్షల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జనశక్తి జనతా దళ్ (జేజేడీ) అధినేత, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పెద్ద కుమారుడు అయిన తేజ్ ప్రతాప్‌కు కల్పిస్తున్న వై-కేటగిరీ భద్రతను కూడా ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు.
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలకు ఇకపై బీహార్ ప్రత్యేక సాయుధ పోలీసులు (బీఎస్‌ఏపీ) భద్రత కల్పిస్తారు. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌కు కల్పించిన వై-ప్లస్ భద్రతను బీహార్ ప్రభుత్వం కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. లాలూ యాదవ్ పెద్ద కుమార్తె, ఎంపీ మీసా భారతికి, తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్‌కు ఉన్న ప్రస్తుత భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని ఓ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.