‘కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది’ అనే సామెతలాగా ఉంది ఉపాధి హామీ (ఈజీఎస్) పథకం తీరు. పథకాల అమలులో పారదర్శకత కోసం ఒక కొత్త ఆవిష్కరణ తెచ్చినా.. వాటిల్లో ఉత్పన్నమయ్యే లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. కానీ, ఈజీఎస్ పథకంలో అలా కన్పించడం లేదు. సాంకేతికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు.. ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని నీరుగార్చే విధంగా కనిపిస్తున్నాయి.
-రఘునాథపాలెం, ఫిబ్రవరి 22
ఈజీఎస్ పనుల్లో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు ప్రక్రియను కేంద్రం అమలుచేస్తోంది. అయితే, ఈ విధానం కూలీలకు తలనొప్పిగా మారింది. సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. కూలీలు చేసే పని ప్రదేశంలో ఇంటర్నెట్, సర్వర్ సమస్యలతో ఫోన్లో ఫొటో స్కాన్ కావడం లేదు. దీంతో కూలీల హాజరు నమోదుగాక వారు వేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫొటో స్కాన్ కోసం కూలీలు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. రోజంతా పనిచేసినప్పటికీ యాప్లో ఫొటో అప్లోడ్ కాకపోవడంతో హాజరు నమోదు కావడంతో దీంతో కూలీలు నిరాశతో ఇంటిబాట పడుతున్నారు. నూతన యాప్ లింక్ విధానంతో గత కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉపాధి పనుల వద్ద కూలీలు పడ్తున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
పనిలేని పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులపాటు పని కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) చట్టాన్ని 2006లో అప్పటి కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఈ పథకం పేరును ‘జీ రామ్ జీ’గా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాంతోపాటు ఈ చట్టంలోని సరికొత్త మార్పులను కూడా తెచ్చింది. పని ప్రదేశంలో ఉదయం ఒకసారి, పని పూర్తయిన తరువాత అక్కడే మరోసారి కూలీల ఫొటోలను లింక్ యాప్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆప్లోడ్తో చేయాలనే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నూతన యాప్ కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్దేశించిన మేరకు పనులను చేయించలేక కూలీల ఫొటోలు తీసి అప్లోడ్ చేయడానికే పరిమితమవుతున్నారు.
దీంతో అసలు ఈ పథకం ఉద్దేశం పూర్తిగా నీరుగాతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం కూలీల ఫొటోలు ఉదయం, సాయంత్రం కలిపి రెండు పూటలా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఫొటోలు అప్లోడ్ కాకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజంతా కష్టపడి పని చేసినా యాప్లో ఫొటో అప్లోడ్ కాకపోవడంతో వారి హాజరు నమోదు కావడం లేదు. దీంతో కూలి పనిని ఎలా లెక్కిస్తారని, ఆ మేరకు నగదును తమ ఖాతాలో ఎలా జమ చేస్తారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యాప్లో సదరు కూలీ ఫొటో విజయవంతంగా అప్లోడ్ అయితేనే హాజరు నమోదు అయినట్లుగా ఫీల్డ్ అసిస్టెంట్ చెబుతున్నాడని అంటున్నారు. అనేకమందికి ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.