గాంధీనగర్: ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తైనట్లు రూ.50.43 లక్షల బిల్లు జారీ అయ్యింది. ఆరోగ్య మంత్రి ఆ ఆసుపత్రిని సందర్శించారు. ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన షాక్ అయ్యారు. ఈ బిల్లు వ్యహారానికి సంబంధించి ఇద్దరు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. (Water Tank Missing) బీజేపీ పాలిత గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 2.55 లక్షల లీటర్ల అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే నిర్మాణం చేపట్టకముందే రూ.50.43 లక్షల బిల్లు జారీ అయ్యింది.
కాగా, ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పన్సారియా ఆ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూగర్భ నీటి ట్యాంక్ నిర్మాణం అక్కడ కనిపించకపోవడంతో ఆయన షాక్ అయ్యారు. ఆమోదం కోసం ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయానికి రూ.50.43 లక్షల బిల్లు పంపడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.
మరోవైపు బాధ్యులైన ఇద్దరు ఇంజినీర్లు మెహుల్ డేవ్, ఎన్వీ కాలియాలను సస్పెండ్ చేయాలని ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పన్సారియా ఆదేశించారు. వారిపై క్రమశిక్షణా చర్యలతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అలాగే సూరత్‌కు చెందిన కాంట్రాక్ట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థను ‘బ్లాక్‌లిస్ట్’లో చేర్చాలని అధికారులను ఆదేశించారు.