హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘మేడిగడ్డ మరమ్మతులకు సమయం పట్టినా, అన్నారం, సుందిళ్ల నుంచి కన్నెపల్లి ద్వారా ఎల్లంపల్లికి అటునుంచి ఎస్సారెస్పీకీ తక్షణమే నీటిని ఎత్తిపోయండి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి రివర్స్ పంపింగ్‌ను ప్రారంభించకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నారని, ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మూడు బరాజ్‌లకు చిన్నపాటి మరమ్మతులు కూడా సర్కార్ చేయలేకపోయిందని విమర్శించారు. పుషలంగా నీటి వనరులున్నా, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది క్యూసెకుల ప్రాణహిత, గోదావరి నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం సాగు, తాగునీరు, విద్యుత్తు కొరతతో రైతాంగం అల్లాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని దుయ్యబట్టారు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించే స్పష్టమైన అవకాశం ఉన్నదని వివరించారు. ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం 20 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిండుకుండలా ఉన్నదని, అకడి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తూనే, రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువకు నీటిని ఎత్తిపోసుకోవచ్చని సూచించారు. కేసీఆర్ ముందుచూపుతో గ్రావిటీ కెనాల్స్ నిర్మించి, నదీజలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించేలా అద్భుతమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు.
లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ విలువ రూ.4,000 కోట్లు కాగా, అందులో సమస్య తలెత్తిన బ్లాక్ విలువ రూ.600 కోట్లు మాత్రమేనని, కుంగిపోయిన ప్రాంతం విలువ రూ.200 కోట్ల మేర మాత్రమే ఉంటుందని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రాజెక్టు మొత్తంలో ఇది కేవలం 0.2 శాతం డ్యామేజ్ మాత్రమేనని, ఇంత స్వల్ప నష్టాన్ని బూచిగా చూపి ప్రాజెక్టును మూలన పడేయడం దారుణమని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చి 2 నెలలు దాటినా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. నవంబర్ లో పనులు మొదలుపెట్టి 2027 నాటికి పూర్తి చేస్తామనడం వారి చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 46 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నదని, ఆ పరిమిత నీటితో ఖరీఫ్ పంట అవసరాలే తీరడం లేదని జీవన్‌రెడ్డి తెలిపారు. వచ్చే యాసంగికి సాగునీరు అందించాలంటే దిగువ నుంచి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ పూర్తినిల్వ సామర్థ్యాన్ని నింపడం ఒకటే మార్గమని సూచించారు. ప్రస్తుతానికి ఆ అవకాశాలన్నీ అందుబాటులో ఉన్నా తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోకుండా రాష్ర్టానికి శనిలా దాపురించారని మండిపడ్డారు.