Sanjjanaa Galrani | తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రముఖ నటి త్రిష పాల్గొనడంపై వస్తున్న రాజకీయ విమర్శలపై నటి సంజనా గల్రాని గట్టిగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె మాట్లాడుతూ, ఒక మహిళను లేదా రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం సరికాదని, దమ్ముంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ చేపడుతున్న పాలన మరియు సేవలపై మాట్లాడాలని సవాల్ విసిరారు.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన అధికారిక వేడుకల్లో త్రిష మొదటి వరుసలో కూర్చోవడం, ముఖ్యమంత్రి విజయ్‌తో సెల్యూట్లు మార్చుకోవడంపై ఒక పత్రికలో వచ్చిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై సంజనా స్పందిస్తూ, విజయ్‌పై వృత్తిపరంగా ఎలాంటి తప్పులు వెతకలేకనే కొందరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. విజయ్ తీసుకుంటున్న తక్షణ నిర్ణయాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని ఆమె కొనియాడారు.
రాజకీయంగా ఎదుర్కొలేకనే మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని, పబ్లిక్ ఫిగర్‌గా ఉన్న త్రిషకు కూడా అందరిలాగే సమానమైన గౌరవం ఉంటుందని సంజనా స్పష్టం చేశారు. వారి వ్యక్తిగత ఎంపికలను తప్పుబట్టడం మానుకుని, ఒక రాజకీయ నాయకుడిగా విజయ్ సాధిస్తున్న విజయాలు లేదా లోపాల గురించి మాట్లాడాలని ఆమె హితవు పలికారు.