అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామం.. ఇక్కడ పంట సాగుచేయాలంటే తలాపునే ఉన్న మానేరు వాగు, డీబీఎం 38 కాల్వే దిక్కు. వాగు ప్రవహించినా.. డీబీఎం కాల్వ పారినా ఆ గ్రామ పరిధిలోని వ్యవసాయ బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉండేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండు వేసవిలోనూ మానేరు వాగు నిండు కుండను తలపించేది. ఇదే చివరి ఆయకట్టు గ్రామమైనా డీబీఎం కాల్వ పొంగి ప్రవహించేది. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాసంగి పంట పండించే వారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మానేరు డిసెంబర్లోనే ఎండిపోయింది. ఫలితంగా బోర్లు, బావుల్లో నీరు అడుగంటింది. దీనిని గుర్తించిన పలువురు రైతులు యాసంగి సాగుకు దూరంగా ఉన్నారు. డీబీఎం కాల్వ ద్వారా గోదావరి జలాలు వస్తాయన్న ఆశతో పంట వేసిన రైతులు చుక్క నీరు రాక ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. బావుల్లో పూడిక తీసినా ఫలితం లేకపోవడంతో కళ్లముందే ఎండిపోతున్న పంటను చూస్తూ ఆందోళన చెందుతున్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఈ గ్రామాన్ని సందర్శించి రైతులను పలుకరించగా.. సాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మరో నెల దాటితే పంట చేతికొచ్చే పరిస్థితి ఉండదని బోరుమంటున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, మార్చి 6 (నమస్తే తెలంగాణ)
తలాపునే ఉన్న మానేరు వాగు పూర్తిగా ఎండిపోవడంతో సాగు నీరందక బూర్నపల్లి గ్రామం బోరున విలపిస్తున్నది. డీబీఎం 38 కాల్వ ద్వారా చుక్క నీరు రావడం లేదు. కాల్వ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో బూర్నపల్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలోనే సాగునీటి సమస్య తీవ్రమైంది. మరో రెండు నెలలు పంటలు ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నా రు. చివరి ప్రయత్నంగా అప్పులు చే సి మరీ బావుల్లో పూడిక తీయిస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడం తో కొందరు రైతులు పంట ను మధ్యలోనే వదిలేస్తున్నా రు. అప్పుల బాధతో అలమటిస్తున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ సాగు నీటికి ఇంత క ష్టం రాలేదని, ఇదే మొదటిసారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పాలనే బాగుండె. ఎన్నడూ నీటి కష్టాలు రాలేదు. మండే ఎండల్లోనూ మానేరు నిండు కుండలా ప్రవహించింది. బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉండేవి. నాకున్న మూడెకరాల భూమి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు బావిలో నీళ్లు అడుగంటిపోయాయి. మూడెకరాల్లో వరి సాగుచేస్తే సగం పంటకు నీళ్లు అందుతలేవు. మోటర్ గంట పాటు నడిస్తే బావి లో నీళ్లు అయిపోతున్నయి. రెండెకరాల పంటను వదిలేయాల్సి వస్తుందేమో. ఇటీవల బావిలో రూ. 80 వేలు పెట్టి పూడికతీయించినా ఫలితం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డీబీ ఎం 38 కాల్వ ద్వారా నీళ్లు వచ్చినయ్. ఇప్పుడు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అధికారులు నీళ్లు వదిలినా వచ్చే అవకాశం లేదు. ఈ కాల్వ చివరి ఆయకట్టు మాదే. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ మాకు ఇప్పుడు తెలిసి వస్తున్నది.
-నేరెళ్ల రామకృష్ణ, రైతు, బూర్నపల్లి
నాకు ఐదెకరాల భూమి ఉన్నది. పం ట వేసే సమయంలో నే మానేరులో నీళ్లు తగ్గినయ్. ఈ ఏడు నీళ్లగోస వత్తదని అ ప్పుడే అర్థమై రెండెకరాల్లోనే వరి సాగు చేసిన. మూడెకరాలు పడావు పెట్టిన. మాకు మానేరు, డీబీఎం కాల్వలే దిక్కు. ఈ రెండు లేకపోతే పంట లు ఎండినట్టే. ఇప్పుడు అదే జరుగుతాం ది. బావిలో పూడికను జేసీబీతో తీయిస్తు న్న. రూ.లక్ష ఖర్చు వత్తాంది. నీళ్లుంట యో, లేదో కాని అప్పులపాలవుతున్నం.
– కాసగాని భిక్షపతి, రైతు, బూర్నపల్లి
బూర్నపల్లితో పాటు పక్కనే ఉన్న వెంకట్రావ్పల్లి గ్రామా ల పరిధిలోని చాలా మంది రైతులు నీటి సమస్యను ముందే గుర్తించి యాసంగి పంట వేయకుండా పక్కన పెట్టారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఎండిపోని మానేరు డిసెంబర్లోనే ఎడారిగా మారడంతో అన్నదాతలు చాలా వరకు అప్రమత్తమయ్యారు. సుమారు 100 ఎకరాలను సాగు చేయకుండా వదిలేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో వానకాలంలో సుమారు 630 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు.
ఈ యాసంగిలో 520 ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మానేరు, డీబీఎం కాల్వలో నీరు లేకపోవడంతో పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బోర్లు, బావుల కింద 380 ఎకరాలు సాగవుతుండగా, మిగిలిన 140 ఎకరాల్లో పంట ఎండిపోతున్నది. అయితే ఫిబ్రవరిలో 0.48 మీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటాయని ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఎండలు మండిపోతుండడంతో జలాలు మరింత కిందికిపోయే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరో రెండు నెలలు నీరందితే పంట చేతికి వస్తుంది. అయితే పరిస్థితి విషమిస్తే మరో 200 ఎకరాల వరకు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు తెలుపుతున్నారు.
నా భర్త రమేశ్ అప్పుల భాధతో ఏప్రిల్ నెలలో ఉరేసుకొని చనిపోయిండు. మాకు న్న రెండెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసినం. నీళ్లందక పొలం ఎండిపోవడం, పంట చేతికి రాకపోవడం, బిడ్డ పెళ్లి చేయడంతో సుమారు రూ. 10 లక్షలకు పైగా అప్పులపాలయ్యాం. అదే సమయంలో కూలిపోతున్న ఇల్లు కట్టి నం. ఇంకా అప్పు పెరిగింది. దీంతో ఒక ఎక రం భూమి అమ్మినం. అయినా అప్పులు తీరలేదు. నా కొడుకు ఆటో నడపగా గిరాకీ సరిగా లేక అంతంత మాత్రమే డబ్బులు వచ్చేవి. అవి ఖర్చులకు సరిపోయేవి కావు. దీంతో నా భర్త ఎప్పుడూ రందితో ఉండెటోడు. చనిపోయే ముందు రోజు చాలా ఏడ్చాడు. మరుసటి రోజు చెప్పకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పక్కనే గుట్ట వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు.
– కొండ రజిత, రైతు రమేశ్ భార్య