యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పరకాలలోని రహదారిపై రోడ్డుపై భైఠాయించి ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. నర్సంపేటలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరిపెడ మండలంలో కూపన్ కోసం బైక్పై వెళ్లిన రైతు అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. కొడకండ్ల మండలంలో యూరియా తీసుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన అన్నదాత మృతి చెందాడు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 10 : రైతులకు వెతలు తప్పడం లేదు. ఉదయమే సొసైటీల ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి లేన్లో వేచి ఉన్న దొరక్కపోవడంతో నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. పరకాలలో బుధ వారం యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు చెప్పడంతో పెద్ద సంఖ్యలో రైతులు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ సిబ్బంది, అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు పరకాల-హనుమకొండ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
నర్సంపేటలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసిననా లారీ రాకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డెక్కారు. పట్టణంలోని అంగడిసెంటర్లో ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మరిపెడ మండలంలోని బోడ తండాకు చెందిన బోడ నర్సింగ్ ఉదయం 4గంటల సమయంలో కూపన్ కోసం ద్విచక్ర వాహనంపై ఉల్లేపల్లి రెవెన్యూ భూక్యా తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పురుషోత్తమాయగూడెం స్టేజీ సమీ పంలో నేషనల్ హైవే రోడ్డు పక్కన బురద గుంటలో పడి తలకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో స్థాని కులు గమనించి 108కు సమాచారం అందించగా, చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పెద్దవంగర మండలంలోని కాన్వాయిగూడేనికి చెందిన రైతు కాసాని ఐలయ్య(36) యూరియా కోసం మంగళవారం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి వెళ్లి రెండు బస్తాలను తీసుకొచ్చాడు. మరికొన్ని బస్తాల కోసం ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తున్న క్రమంలో నర్సింగా పురంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ ఎంజీఎం ద వాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.