స్టేషన్‌ఘన్‌పూర్, జూలై 30 : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం ప్రాంత రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వెళ్లే ప్రధాన కాల్వకు ఇటీవల నీళ్లు విడుదల చేశారు. అయితే ఈ కెనాల్‌పై ఇప్పగూడెం వద్ద ఉన్న 3ఎల్ ఉపకాల్వలో మాత్రం జలాలు పారడం లేదు. ఈ కాల్వ గుంటూరుపల్లి వైపు 6 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. దీనిలో నీళ్లు పారితే పెద్దకుంట, బండకుంట, సత్రం కుంట, రాయకుంట, దమ్మన్నకుంటల్లోకి నీరు చేరుతుంది. వీటి కింద 200 ఎకరాల వరకు భూములు సాగవుతాయి.
అలాగే కాల్వ నీటితో మరో 300 ఎకరాలు, మొత్తం 500 ఎకరాల్లో పంటలు పండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పగూడెం వద్ద ప్రధాన కాల్వ పల్లం ఎక్కువగా ఉండడంతో నీరు వేగంగా పాలకుర్తి వైపే వెళ్తున్నది. 3ఎల్ కెనాల్‌కు రావాలంటే ప్రధాన కాల్వలో ప్రవాహానికి అడ్డుగా రాళ్లు వేయాల్సి ఉంటుంది. గత యాసంగి పంటను కాపాడుకునేందుకు ఇక్కడి రైతులు అడ్డుగా వేసిన రాళ్లను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొలగించారు.
దీనికి తోడు రాళ్లు వేయాలంటే జేసీబీకి ఖర్చు చేయాల్సి వస్తుండడంతో రైతులు ఆ ప్రయత్నాన్ని వదులుకున్నారు. దీంతో ఈ ఉపకాల్వ కింద అక్కడక్కడా వేసిన పంటలు ఎండిపోతుండగా, మిగతా భూమి ఇంకా సాగులోకి రాలేదు. ఇటీవల యశస్వినీరెడ్డితో కలిసి నీళ్లు విడుదల చేసిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రైతులు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అలవాటు చేసుకోవాలని, దీని వల్ల అధిక దిగుబడి వస్తుందని సూచించారు.
అయితే తమ ఉపకాల్వకు అసలు నీళ్లే రావడం లేదని, దాని పక్కనున్న పొలాలే బీడుగా వదిలేసే పరిస్థితి దాపురించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేయకపోతే తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి 3ఎల్ కాల్వకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యాసంగిలో కూడా నష్టపోయిన..
నాకు మూడెకరాల పొలం ఉంది, మాకు వర్షంతో పాటు 3ఎల్ కెనాల్ నీళ్లే దిక్కు. యాసంగిలో కూడా ఈ కెనాల్‌కు నీళ్లు రాక వరి పంట ఎండిపోయి సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వచ్చింది. మా గ్రామంలో వేసిన కొద్దిపాటి పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా పాలకుర్తికి నీళ్లు తరలించుకుపోతుంటే మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. సాగు చేసే అదను దాటాక, వేసిన పంటలు ఎండిపోయాక నీళ్లిస్తరా? ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళనలు చేస్తాం.
– గొడిశాల సతీశ్, రైతు, ఇప్పగూడెం
సమస్యకు పరిష్కారం చూపాలి
3ఎల్ కెనాల్‌కు నీళ్లు వస్తే ఐదు కుంటలు నిండి సుమారు 200 ఎకరాలు సాగవుతుంది. ఏ గ్రామంలో కూడా ఇన్ని కుంటలు నిండే కాల్వ లేదు. యాసంగికి కూడా ఈ కాల్వకు నీరు రాకపోవడంతో చాలా మంది రైతులం నష్టపోయాం. నీళ్ల కోసం ప్రధాన కాల్వలో రాళ్లు అడ్డం వేస్తే పాలకుర్తి ఎమ్మెల్యే వచ్చి వాటిని తొలగిస్తున్నది. దీంతో సుమారు 500 ఎకరాల భూములు బీడుగా మారే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించి సాగునీరందించాలి.
– జూలుకుంట్ల ప్రకాశ్ రెడ్డి, రైతు, ఇప్పగూడెం
నీళ్లు రాకుంటే వలస పోవాల్సిందే..
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు లేక రెండు బోర్లు వేస్తే అవి ఫెయిలయ్యాయి. కాల్వలో నీళ్లు రాకపోవడంతో నాట్లు వేయకుండా వదిలేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు కొంత మంది రైతులు నాట్లు వేసుకున్నారు. మళ్లీ వానలు పడకపోతే అవి కూడా ఎండిపోతాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి 3ఎల్ కెనాల్‌కు సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే భూములను వదిలిపెట్టి పట్నం వైపు వలస పోవాల్సి వస్తుంది.
– గొడిశాల శ్రీనివాస్, రైతు, ఇప్పగూడెం