రాయపోల్ ఫిబ్రవరి 21 : అసెంబ్లీలో మంత్రులు, ప్రతిపక్ష నేతల మధ్య ప్రజా సమస్యలపై వాదోపవాదాలు జోరుగా సాగుతుంటాయి. శాసనసభ కార్యకలాపాలను విద్యార్థులకు మరింత అవగతం చేసేందుకు రాయపోల్ ఉన్నత పాఠశాలలో శనివారం మాక్ అసెంబ్లీ (Mock Assembly) నిర్వహించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పాత్రలను పోషించిన విద్యార్థులు.. అచ్చం అసెంబ్లీ తరహాలోనే కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ ఆలోచింపజేశారు.
మాక్ అసెంబ్లీలో గవర్నర్గా సమంత, ముఖ్యమంత్రిగా రేణుక, ప్రతిపక్ష నాయకుడిగా ధ్రువాక్షిత్ రెడ్డి ఆకట్టుకున్నారు. ప్రజా సమస్యలపై చర్చలు, సంక్షేమ బిల్లుల ప్రవేశపెట్టడం వంటి అంశాలను సమర్థంగా ప్రదర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..నేటి బాలలు రేపటి దేశ నాయకులు, శాసనకర్తలని పేర్కొన్నారు.
మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు
భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించే స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఆయన ఆశీర్వదించారు. చదువుతో పాటు రాజకీయాలపై.. అసెంబ్లీ సమావేశాలపై కూడా అవగాహన కల్పించిన మాక్ అసెంబ్లీ నిర్వహణను అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు సావిత్రి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.