తొర్రూరు, ఆగస్టు 18 : కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మపురం రోడ్డులో ఉన్న పిఎసిఎస్ భవనం ఎదుట సోమవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో బారులు తీశారు. గంటల తరబడి వేచి ఉన్న రైతులకు కేవలం రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తూ ఒక నానో యూరియాతో లింక్ పెట్టి పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం వరకు వేచి చూసినా కేవలం రెండు బస్తాలు మాత్రమే దక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోందని రైతులు వాపోయారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలోనే యూరియా కోసం నానా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టించుకునే తీరు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు పిఎస్సిఎస్ వద్దకు చేరుకొని పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోతే తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, వెంకన్న, శ్రీనివాస్, లలిత, యాకు ఉప్పలమ్మ, వెంకటమ్మ, మహేందర్, ప్రశాంత్, ఉపేందర్ రెడ్డి, సురేష్, విశాల్ నాయక్, కృష్ణ, మధు, వీరాంజనేయులు, సుమంత్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.